జనసేన అభ్యర్థికి మద్దతుగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం అలాంటిదేమీ లేదు. అయితే ఏపీలో జనసేనతోనే తమ రాజకీయ ప్రయాణమని పురందేశ్వరి తరచూ చెబుతున్నారు. జనసేనతో కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, కనీసం తాను లోక్‌సభకు ఎన్నిక కావచ్చనేది పురందేశ్వరి ఆలోచన.
అందుకే జనసేన విషయంలో పురందేశ్వరి చాలా సానుకూలంగా మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆమె సామాజిక వర్గం ఎక్కువగా ఉందంటున్న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌కుమార్ తరపున ఆమె మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పురందేశ్వరి సోదరుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి మూటకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ దఫా టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో సుహాసిని ఏమయ్యారో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు సుహాసిని మేనత్త పురందేశ్వరి తన కులపోళ్ల ఓట్లను జనసేనకు వేయించేందుకు ప్రచారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పురందేశ్వరి నాయకత్వం వహిస్తున్న ఏపీ బీజేపీతో కలిసి మాత్రం పవన్ ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఏపీలో పురందేశ్వరి క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతుంటే, అక్కడక్కడ జనసేన నాయకులు పాల్గొంటున్నారు.
కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ, జనసేన పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడుతాయన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు రానున్న రోజుల్లో కలిసి పని చేస్తాయని ఆశిద్దాం.