తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కోర్టుకీడ్చి, చట్ట ప్రకారం శిక్ష పడేంత వరకూ విశ్రమించనని హెచ్చరించిన మంత్రి ఆర్కే రోజా… అన్నంత పని చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, నగరి టీడీపీ ఇన్చార్జ్ గాలి భానుప్రకాశ్‌తో పాటు ఎల్లో చానల్‌కు చెందిన జర్నలిస్ట్‌పై మంగళవారం నగరి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
మంత్రి రోజాపై ప్రధానంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఎల్లో మీడియా జర్నలిస్టు బజారు భాష ప్రయోగించారు. బండారు వ్యాఖ్యలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అసలు మనిషిగా బతకడానికే అనర్హులని పలువురు సీనియర్ హీరోయిన్లు కామెంట్స్ చేశారు. రోజాకు సంఘీభావం తెలిపారు.
రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ వెంటనే బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయ స్థానంలో పోరాటం చేస్తానని అప్పట్లో రోజా హెచ్చరించారు. ఎట్టకేలకు ఆ దారిలోనే రోజా ప్రయాణించడం విశేషం.
రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలోని కోర్టులో క్రిమినల్ డెఫిమేషన్ పిటిషన్‌ను వేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని, పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని పిటిషన్లో పేర్కొన్నారు. రోజా పిటిషన్‌ను నగరి కోర్టు స్వీకరించింది. పరువు నష్టం దావా చివరికి ఏమవుతుందో చూడాలి.