తణుకు..పొత్తుకు హంసపాదు

పులి రక్తం రుచి చూడకూడదు. చూసిందా దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ పోలిక కరెక్ట్ గా సింక్ అవుతుంది అని చెప్పలేం కానీ, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనంలో…

పులి రక్తం రుచి చూడకూడదు. చూసిందా దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ పోలిక కరెక్ట్ గా సింక్ అవుతుంది అని చెప్పలేం కానీ, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనంలో తనకు వున్న ‘క్రేజ్’ ను డైరక్ట్ గా రుచి చూసారు. తెలుగుదేశం ఆపిందో, లేదా ఆయనే ఆగారో మొత్తం మీద నాలుగేళ్ల తాత్సారం చేసారు. ఆఖరికి ఎన్నికలు నెలల్లోకి వచ్చేసరికి ఈస్ట్-వెస్ట్ ను టార్గెట్ గా పెట్టుకుని వారాహి రథాన్ని బయటకు తీసారు. ఇప్పుడు రుచి తెలిసింది. అందుకే ఇక నో హైదరాబాద్..ఓన్లీ ఆంధ్ర అంటూ అటే తిరుగుతున్నారు.

ఈ యాత్రకు ముందుగానే తెలుగుదేశంతో పొత్తు పక్కా అనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. అయితే ఎంతగా జనసేనతో అవసరం వున్నా, చంద్రబాబు ఎన్ని సీట్లు జనసేనకు ఇస్తారు అన్నది క్వశ్చను. దీని మీద రకరకాల వార్తలు వినిపిస్తూనే వున్నాయి. చంద్రబాబు మాగ్జిమమ్ 30 సీట్లకు మించి ఇవ్వమన్నా ఇవ్వరు అన్న లెక్కలు వినిపిస్తున్నాయి. కానీ సమస్య ఏమిటంటే పవన్ తమ పార్టీకి 30 చాలు అని సరిపెట్టుకుంటారో లేదో తెలియదు కానీ జనసేన అభిమానులు మాత్రం సరిపెట్టుకోరు. ఎందుకంటే వారు పవన్ ను సిఎమ్ గా చూడాలనుకుంటున్నారు.

ముఫై సీట్లలో పోటీ చేస్తూ, తాము అధికారంలోకి వస్తే అంటూ ఓ మేనిఫెస్టో ఎలా పెడతారు. తమ మేనిపెస్టోను తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది. అప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అనౌన్స్ చేయాలి. అది అలా వుంచితే కేవలం ముఫై సీట్లలో పోటీ కోసం ఇంతలా రంకెలు వేయడం అవసరమా? ఇదేనా సాధించింది అని కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యాభై సీట్లు కనుక జనసేనకు కేటాయిస్తే చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారు. తమ పార్టీ జనాలు అలుగుతారు.

పైగా జనసేనతో పోల్చుకుంటే ప్రతి చోటా తెలుగుదేశం పార్టీదే పై చేయిగా వుంటుంది. అందువల్ల పొత్తులో భాగంగా ఆ సీటు ఇవ్వడానికి వీల్లేదంటారు స్థానిక నాయకులు. ఇదో పీటముడిగా మారుతుంది. ఇప్పుడు వెస్ట్ గోదావరి తణుకు విషయంలో అదే వినిపిస్తోంది. ఈ సీటు నుంచి జనసేన అభ్యర్థిని పవన్ ప్రకటించేసారు అనే వార్తలు బయటకు వచ్చాయి. అంతే తెలుగుదేశం అనుకూల మీడియా వళ్లు విరుచుకుంది. అలా ఎలా ఇస్తారు. అక్కడ తేదేపా ఓట్లు ఎన్ని, జనసేన ఓట్లు ఎన్ని అంటూ లెక్కలు తీయడం ప్రారంభించింది.

నిజానికి ఇలా లెక్కలు తీస్తే ప్రతి చోటా తెలుగుదేశం పార్టీ ఓట్లే ఎక్కువ వుంటాయి. అలా అని జనసేనకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వుంటారా ఏంటీ? ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ 30 సీట్లతో సరిపెట్టుకునే కనిపించడం లేదు. ఈస్ట్..వెస్ట్ పక్కన పెడితే జిల్లాకు రెండు సీట్లు అడిగినా 22 సీట్లు అవుతాయి. ఈస్ట్ వెస్ట్ ల్లో అయిదేసి సీట్లు అడిగినా మొత్తం 32 సీట్లు అవుతాయి. అంతకన్నా ఎక్కువ కావాలి అంటే జిల్లాకు మూడు అడగాల్సి వుంటుంది.

ఈ ఫీట్ తెలుగుదేశం పార్టీకి సాధ్యం అయ్యేది కాదు. లేదంటే బాబుగారు ఓల్డ్ ట్రిక్ అమలు చేయాలి. తాను టికెట్ లు ఇవ్వాలనుకునే వారిని ముందుగానే జనసేనలోకి పంపి, పొత్తు ధర్మాన్ని నటించి వారికి వదలాలి. ఆ విధంగా తమ వారికే అక్కడ టికెట్ లు వచ్చేలా చేయాలి. కానీ ఈ ఓల్డ్ స్కూల్ డ్రామా జనాలకు అర్థం అయిపోయింది. ఈ జనరేషన్ లో అలాంటివి నడవకపోవచ్చు.

ఏ కారణం చేత అయినా పవన్ తల ఊపినా, జనంలోకి అసలు విషయం వెళ్తే మొదటికే మోసం వస్తుంది. తణుకు సీటు క్లారిటీగా ప్రకటించకపోతేనే రగడ మొదలైంది. ఇక క్లారిటీగా సీట్లు ప్రకటించడం మొదలైతే ఇంకెంత రగడ అవుతుందో.

అవును అది సరే…లోకేష్ పాద యాత్రలో అక్కడక్కడ సీట్లు ప్రకటించవచ్చు. కానీ వారాహి యాత్రలో పవన్ సీటు ప్రకటించకూడదా?