కాంగ్రెస్ పార్టీలోకి చేరబోవడం లేదని ప్రశాంత్ కిషోర్, ఆయనను చేర్చుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా ప్రకటించేశారు. ఇది వరకే ఒక సారి ప్రచారం జరిగిన అంశంపై, మళ్లీ ప్రచారం జరిగి.. రెండోసారి కూడా ఈ చేరిక సాధ్యం కాలేదు. అదెందుకు కాలేదో పక్కన పెడితే, కాంగ్రెస్ వ్యవహారాల్లో చాలా మార్పుచేర్పులు జరగాలంటూ ప్రశాంత్ కిషోర్ కొన్ని సూచనలు చేసినట్టుగా అయితే ఉన్నారు.
ఇప్పుడు పీకేను కాంగ్రెస్ చేర్చుకున్నా, చేర్చుకోకపోయినా.. లేదా పీకేనే ఆ పార్టీలోకి చేరవద్దని అనుకున్నా… ఆయన చెప్పిన రీతిలో మార్పులు మాత్రం తప్పనిసరిగా జరగాలి. ఆ మార్పులు కేవలం కాగితాలకు, ప్రకటనలకు పరిమితం కాకూడదు కూడా!
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా.. ఇప్పటికీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే! ఈ విషయం మాట వరసగా చెప్పేది కాదు. దాదాపు మూడు వందల లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది గత ఎన్నికల్లో కూడా! దాదాపు 270 సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ పోటీనే నడిచింది గత ఎన్నికల్లో కూడా!
లోక్ సభ లో మెజారిటీకి ఎన్ని సీట్లు అయితే అవసరమో.. అన్ని సీట్లలో అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి లేదా రెండో స్థానంలో ఉంది! ఇది వాస్తవం. ఇదే విషయాన్నే చెప్పి కాంగ్రెస్ లో స్ఫూర్తి రగలించే సూచన చేశాడు ప్రశాంత్ కిషోర్. పోరాడితే పోయేదేమీ లేదు.. ప్రతిపక్ష వాసం తప్ప! అన్నట్టుగా కాంగ్రెస్ కు పీకే ఉద్భోధించే ప్రయత్నం చేశాడు.
కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కామెడీలు వంటి అంశాలు ఆ పార్టీ ని చిన్నబుచ్చే అంశాలు అయితే, మూడు వందల స్థానాల్లో ఆ పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో ఉందనే విషయం మాత్రం విస్మరించేది కాదు. ఆ మూడు వందల స్థానాల్లోనూ కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు గెలిచేయాల్సిన అవసరం కూడా లేదు!
యూపీఏ, యూపీఏ 2 సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వందల లోపు స్థానాల్లోనే! కాంగ్రెస్ పార్టీ నూటా యాభై స్థానాలకు మించి సాధించినా.. పొలిటికల్ గేమ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది! మరి మూడు వందల స్థానాలపై దృష్టి పెట్టి వాటిల్లో సగాన్ని గెలవడం గురించి కాంగ్రెస్ కసరత్తు సాగిస్తే చాలేమో!