పట్నం, చెన్నమనేని విలువ తుమ్మలకు లేదా?

అత్త కొట్టినందుకు కాదు గానీ.. తోడికోడలు ఏడ్చినందుకు బాధపడిందిట వెనకటికి ఓ ఇల్లాలు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల పరిస్థితి ఆ ఇల్లాలి కంటె భిన్నంగా ఏమీ లేదు.  Advertisement గతంలో…

అత్త కొట్టినందుకు కాదు గానీ.. తోడికోడలు ఏడ్చినందుకు బాధపడిందిట వెనకటికి ఓ ఇల్లాలు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల పరిస్థితి ఆ ఇల్లాలి కంటె భిన్నంగా ఏమీ లేదు. 

గతంలో ఓడిపోయిన పాలేరునుంచే మళ్లీ పోటీచేసి గెలుస్తానని తుమ్మల నాగేశ్వరరావు చాలాకాలంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయినా సరే, ఆయన ఆశలను భంగపరుస్తూ టికెట్ నిరాకరించినందుకు వారు ఇప్పుడు పెద్దగా బాధపడడం లేదు. తమ నాయకుడు ఇంత కొమ్ములు తిరిగిన సీనియర్ అయి ఉండి కూడా.. జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడై ఉండి కూడా.. ఆయనకు ఏదో ఒక కేబినెట్ ర్యాంకు పదవిని కట్టబెట్టలేదే అని కుమిలిపోతున్నారు. కనీసం గులాబీదళపతి కేసీఆర్.. తమ నాయకుడిని స్వయంగా పిలిపించి మాట్లాడలేదే.. అని కునారిల్లిపోతున్నారు. పట్నం మహేందర్ రెడ్డి, చెన్నమనేని రమేష్ పాటి విలువ తమ నాయకుడికి లేకపోయిందా? అని ఆవేదన చెందుతున్నారు.

కేసీఆర్ చాలా లౌక్యనీతితో రాజకీయం నడిపిస్తున్నారు. టికెట్ల ఎంపిక విషయంలో తన ఇష్టానుసారమే నిర్ణయాలు తీసుకున్నారు. ఎవ్వరి ఒత్తిడికీ తలొగ్గ లేదు. ఎవ్వరి ఆబ్లిగేషన్లను ఖాతరు చేయలేదు. సర్వేల ద్వారా ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో బేరీజు వేయడం, అలాగే వారి మీద తనకున్న అవగాహనను బట్టి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. 

అయితే టికెట్ దక్కని వారి విషయంలో ఆయన అనేక రకాల మార్గాలు అనుసరిస్తున్నారు. కొందరిని పట్టించుకోలేదు. కొందరిని హెచ్చరిస్తున్నారు. మళ్లీ రాబోయేది గులాబీ ప్రభుత్వమే అని, ఇప్పుడు తోకజాడిస్తే దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుందని అంటున్నారు. కొందరని పార్టీలోని ఇతర నాయకుల ద్వారా బుజ్జగింపులు చేస్తున్నారు. కొందరిని మాత్రం స్వయంగా తానే డీల్ చేస్తున్నారు. అలాంటి అవకాశం దక్కించుకున్న వారే.. పట్నం మహేందర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్.

పట్నం మహేందర్ రెడ్డికి , ఈ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత కూడా మంత్రి పదవి కంటిన్యూ చేస్తానని కేసీఆర్ చాలా నమ్మకంగా హామీ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలే పౌరసత్వ వివాదం సమస్యతో ఉన్న చెన్నమనేని రమేశ్ విషయంలో.. రాజకీయ డోలాయమానం కూడా లేకుండా కేసీఆర్ ఆయనకు ఆఫర్ ప్రకటించారు. ఏకంగా అయిదేళ్ల కాలపరిమితి ఉండేలా,.. కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు చేసేశారు. మళ్లీ గెలిచినా పదవి ఉంటుందనే వాగ్దానం కూడా అనవసరం. గాడ్ ఫాదర్ (చిరంజీవిది కాదు) సినిమా తరహాలో.. ‘‘మేక్ హిమ్ యాన్ ఆఫర్.. హి కాన్ట్ రెఫ్యూజ్’’ అనే తిరుగులేని సిద్ధాంతాన్ని కేసీఆర్ వారి విషయంలో అనుసరించారు.

ఇప్పుడు తుమ్మలకు గానీ, ఆయన అనుచర గణానికి గానీ అసలు బాధ అదే. ఆ ఇద్దరి పాటి విలువ తమ నాయకుడికి లేకపోయిందా? అని! పూర్వ తెలుగుదేశంలో కేసీఆర్ కంటె వైభవం వెలగబెట్టిన నాయకుడు తుమ్మల. అలాంటి తుమ్మల 2018లో తెరాస 88 స్థానాలు గెలిచిన సమయంలోనే.. తన సీటు దక్కించుకోలేకపోయారనే చులకన కేసీఆర్ కు ఉంది. తర్వాతి పరిణామాల్లో పాలేరులో గెలిచిన కాంగ్రెస్ నేత తన పంచకు రావడంతో ఆయన తుమ్మలను పట్టించుకోవడం మానేశారు. 

ఈ నాలుగేళ్ల కాలంలో కేసీఆర్ , తుమ్మలతో ఒక్క భేటీ కూడా జరపలేదు. ఇప్పుడు టికెటూ ఇవ్వలేదు. విషాధభరితమైన ఇన్ని అసంతృప్తుల నడుమ తుమ్మల వర్గం పార్టీ మారడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.