సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని విజయశాంతి తిప్పికొట్టారు. విజయశాంతి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని.. గతంలో కొంతమంది హీరోల్ని పొగిడిన నోటితోనే, ఇప్పుడు తిడుతున్నారంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీటిపై ఆమె సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
కొన్ని సందర్భాల్లో కొందరు నటుల్ని మెచ్చుకున్నట్టు, అదే నటుల్ని మరికొన్ని సందర్భాల్లో విమర్శించినట్టు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆరోపించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తెలంగాణ ఉద్యమాన్ని గతంలో సమర్థించని కొంతమంది సినిమా హీరోల్ని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఓ అవగాహనతో దగ్గరకు తీసుకుంటున్నారని ఆరోపించారు. తను అలాంటి పనులు చేయనని అన్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమాన్ని బలపరచని హీరోలు, వాళ్ల సినిమాలను తను ఎప్పటికీ సమర్థించనని విజయశాంతి స్పష్టంచేశారు. తను చెప్పాలనుకుంటున్న విషయాల్ని తన అధికారిక హ్యాండిల్స్ ద్వారా సూటిగా చెబుతానని.. ఇతర మాధ్యమాల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు విజయశాంతి.