తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను ఎందుకు సోషల్ మీడియా మాలోకం గా పిలుస్తూ ఉంటుందో మరోసారి రుజువు అయ్యింది. ఇప్పటికే అనేక సార్లు ఈ విషయాన్ని రుజువు చేయడానికి తన వంతు కృషి చేస్తూ ఉన్నారు లోకేష్. ఈ క్రమంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు వెళ్లి లోకేష్ రొటీన్ కామెడీ అంతా చేసేశారు.
తిరుపతి బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని పిలుపునిచ్చిన లోకేష్.. ఆమెను గెలిపిస్తే ప్రజలకు దక్కేదేమిటో కూడా ప్రకటించారు.
ఇంతకీ లోకేష్ చెప్పొచ్చేదేమిటంటే.. పనబాకను తిరుపతిలో గెలిపిస్తే.. వృద్ధుల పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతుందట. అలాగే పెట్రోల్ ధరలు తగ్గుతాయట. ఇంకా గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయట! ఇదంతా పనబాక లక్ష్మిని, అందునా ఒక్క తెలుగుదేశం అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే! అని లోకేష్ ప్రచారం చేసుకోవడం ఆయన తీరుకు నిదర్శనంగా మారింది.
లోకేష్ తను మాలోకం అని ఫిక్స్ అయ్యారో లేక జనాలను మాలోకాలుగా భావిస్తున్నారో కానీ, ఉప ఎన్నికలో ఎంపీగా తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వృద్ధాప్య పెన్షన్లను పెంచుతామంటూ, పెట్రో-గ్యాస్ ధరలు తగ్గుతాయంటూ ప్రకటించుకోవడం మాత్రం కామెడీకి పరాకాష్టగా మారింది.
లోకేష్ ప్రచారం చేస్తే… అక్కడ తెలుగుదేశం కామెడీ అయిపోతుందనే విషయం గురించి ముందు నుంచినే అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ లోకేష్ రొటీన్ కామెడీనే కొంచెం కొత్త తరహాలో చేశారు.