పల్నాడు జిల్లా నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఎట్టకేలకు వైసీపీని వీడారు. ఎంపీ పదవితో పాటు పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్నికల సమయంలో నాయకులు రావడం, పోవడం సహజమే. అయితే కృష్ణదేవరాయులు విషయం వేరు. వైసీపీ అధిష్టానం తీరే ఆయన్ను బయటికి పంపేలా చేసింది. ఎవరి కోసమో, కృష్ణదేవరాయుల్ని సీఎం జగన్ పోగొట్టుకున్నారనే ఆవేదనలో వైసీపీలో వుంది.
నరసారావుపేటలో శ్రీకృష్ణదేవరాయులు లేని లోటును ఆ ఇద్దరితో భర్తీ చేస్తే సరిపోతుందని పల్నాడు జిల్లాలోని వైసీపీ శ్రేణులు ఆవేదనతో అంటున్నాయి. నరసారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి ఒక బీసీ నాయకుడిని బరిలో నిలపడానికే గుంటూరు లోక్‌సభ నుంచి శ్రీకృష్ణదేవరాయుల్ని పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. ఇందుకు ఆయన ససేమిరా అన్నారు.
ఇదే సందర్భంలో సీఎంవోలో సీఎం జగన్ మీడియా వ్యవహారాలు చూసే కృష్ణుడొకాయన తన పాదసేవ చేసే మాటలకారైన యువ నాయకుడికి నరసారావుపేట టికెట్ ఇప్పించే క్రమంలో… లావు కృష్ణదేవరాయుల్ని పోగొట్టుకోవాల్సి వచ్చిందని నరసారావుపేట పార్లమెంట్ పరిధిలోని అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కృష్ణదేవరాయులు పార్టీ వీడడానికి ఆ ఇద్దరు గురుశిష్యులే కారణమని సీఎంవో కోడై కూస్తోంది. ఇప్పుడు ఆ సీఎంవో అధికారి, ఆయన శిష్యుడు కలిసి నరసారావుపేటలో వైసీపీని గట్టెక్కించాలని వ్యంగ్యంగా అంటున్నారు.
ఎక్కడైనా పార్టీకి ప్రయోజనం కలిగించే నేతల్ని తెచ్చుకుంటారని, నరసారావుపేటలో మాత్రం పనిగట్టుకుని నష్టం కలిగించేలా రాజకీయాలకు సంబంధం లేని వాళ్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేసే తమకంటే, సీఎంవోలో లాబీయింగ్‌లు మాత్రమే చేసే వారి మాటలు వింటే, ఇట్లే వుంటుందని వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.