ష‌ర్మిల క‌ట్ట‌డీకి ఆ వ్యూహ‌మే వైసీపీకి శ్రీ‌రామ ర‌క్ష‌!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైఎస్ ష‌ర్మిల ఎలాగైనా త‌న గురించి చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నారు. దీంతో అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేయ‌డానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారంలో త‌న అన్న వైఎస్…

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైఎస్ ష‌ర్మిల ఎలాగైనా త‌న గురించి చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నారు. దీంతో అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేయ‌డానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారంలో త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ ఉండ‌డంతో, విమ‌ర్శ‌లు చేస్తే ఎల్లో మీడియా కూడా త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆమెకు తెలుసు. ఈ నేప‌థ్యంలో వైఎస్ ష‌ర్మిల ఆశించిన‌ట్టు, వైసీపీ న‌డుచుకుంటుందా? లేక ఆమెను క‌ట్ట‌డి చేయ‌డానికి ఏదైనా వ్యూహం ర‌చిస్తుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ష‌ర్మిల‌కు వైసీపీ నేత‌లు కౌంట‌ర్లు ఇవ్వ‌డం మొద‌లు పెడితే, ముమ్మాటికీ ఆమె ట్రాప్‌లో అధికార పార్టీ ప‌డిన‌ట్టే, అలా కాకుండా ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేయాలంటే వైసీపీ ముందున్న ఏకైక ఆప్ష‌న్ తెలంగాణ వ్యూహం. అదేంటంటే… తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ పేరుతో ప్ర‌జాద‌ర‌ణ పొందాల‌ని ష‌ర్మిల ప్ర‌య‌త్నించారు. దీంతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల‌పై తీవ్ర‌స్థాయిలో ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.

ఇదే సంద‌ర్భంలో ఆమె విమ‌ర్శ‌ల‌కు స్పందించ‌కూడ‌ద‌ని నాటి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి నిర్ణ‌యించారు. బీఆర్ఎస్ నేత‌లు కూడా ష‌ర్మిల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌కు స్పందించి, ఆమెను పెద్ద లీడ‌ర్‌ను ఎందుకు చేయాల‌ని తెలంగాణ రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ విడివిడిగా ఒక నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల మ‌రీ శ్రుతిమించి విమ‌ర్శ‌లు చేసిన చోట మాత్రం… కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నాయ‌కులు ఘాటుగా స్పందించారు.

మ‌రో వైపు రెచ్చ‌గొట్టేలా విమ‌ర్శ‌లు చేస్తూ, శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగిస్తున్నార‌నే కార‌ణంతో ష‌ర్మిల పాద‌యాత్ర‌ను బీఆర్ఎస్ స‌ర్కార్ అడ్డుకుంది. న్యాయ పోరాటం చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. చివ‌రికి తెలంగాణ‌లో త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌ని తెలుసుకుని, ఎగిరి ఎగిరి అల‌సిపోయి, కాంగ్రెస్ నీడ‌లో సేద తీర‌డానికి ఆమె నిర్ణ‌యించుకున్నారు.

అదే ప్ర‌యోగాన్ని ఇప్పుడు ఏపీలో ష‌ర్మిల ప్ర‌యోగిస్తున్నారు. అయితే తెలంగాణ‌లో మాదిరిగా ష‌ర్మిల‌ను అడ్డుకోడానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండ‌క‌పోవ‌చ్చు. ఏపీలో త‌న అన్న ప్ర‌భుత్వ‌మే ఉండ‌డం వ‌ల్ల‌, త‌న‌నేమీ చేయ‌లేదనే న‌మ్మ‌కం కూడా ష‌ర్మిల‌తో ఇష్టానుసారం మాట్లాడించొచ్చు. ష‌ర్మిల కామెంట్స్‌పై టీడీపీ మాదిరిగా వైసీపీ కూడా మౌనాన్ని పాటించ‌డం ఉత్త‌మం. 

ఉదాహ‌ర‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజు ష‌ర్మిల చేసిన విమ‌ర్శ‌ల‌పై వైసీపీ సీనియ‌ర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తెలంగాణ నుంచి వ‌చ్చిన ష‌ర్మిల‌కు ఏపీ అభివృద్ధిపై ఏం తెలుస‌ని ప్ర‌శ్నించారు. అలాగే జ‌గ‌న్‌రెడ్డి అని ప్ర‌త్యేకంగా కులం దృష్టితో ష‌ర్మిల మాట్లాడ్డాన్ని వైవీ త‌ప్పు ప‌ట్టారు. 

ఇవే విష‌యాల్ని ష‌ర్మిల తీసుకుని, మ‌రోసారి అధికార పార్టీ నేత‌ల్ని స‌వాల్ విసిరారు. అలాగే జ‌గ‌న్‌రెడ్డి అన‌డం న‌చ్చ‌క‌పోతే, ఇక‌పై జ‌గ‌న‌న్న అంటాన‌ని ష‌ర్మిల వెట‌క‌రించారు. ఇదే సంద‌ర్భంలో వైవీ సుబ్బారెడ్డికి ఆమె స‌వాల్ విసిరారు. 

‘మీరు చేసిన అభివృద్ధి చూపించండి. చూడటానికి సిద్ధంగా ఉన్నా. డేట్, టైం మీరు చెబుతారా? నన్ను చెప్పమన్నా చెబుతా. ఆ డిబేట్‌కు మేధావులను పిలుద్ధాం. నాతో పాటు మీడియా వస్తుంది. ప్రతిపక్షాలు వస్తాయి. గత నాలుగున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధిని మా అందరికీ చూపించండి. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ‌? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ‌? మీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని’ వైఎస్ షర్మిల త‌న‌దైన స్టైల్‌లో వైవీ సుబ్బారెడ్డికి స‌వాల్ విస‌ర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

ష‌ర్మిల‌కు స‌మాధానాలు చెప్ప‌డం అంటే, ఆమె రాజ‌కీయ ఉనికిని గుర్తించ‌డ‌మే. ష‌ర్మిల‌కు అంత సీన్ వుంద‌నుకుంటే వైసీపీ ఇష్టం. కానీ సీఎం జ‌గ‌న్‌కు త‌న‌కున్న ర‌క్త సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆమె ఏదో ర‌కంగా రెచ్చ‌గొట్ట‌డానికే నిత్యం ప్ర‌య‌త్నిస్తారు. ఆమెకు ఊత‌మిచ్చేలా వైసీపీ ప్ర‌వ‌ర్తిస్తుందా? లేదా? అనేది ఆ పార్టీ తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఏది ఏమైనా తెలంగాణ‌లో ష‌ర్మిల‌ను సైలెంట్‌గానే రాజ‌కీయ ఉనికి లేకుండా చేసిన విధానం క‌ళ్ల ముందే వుంది.