ఈనెల 18వ తేదీన న్యూఢిల్లీలో జరగబోతున్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి జనసేనకు కూడా ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి తాను వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. భాగస్వామి పార్టీల సమావేశం నిర్వహిస్తూండగా జనసేనకు మాత్రం ఆహ్వానం అందకపోవడం పై కొన్ని రోజులుగా మీడియాలో రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ అస్తిత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక అవసరాల దృష్ట్యా ఆయనతో పొత్తు బంధం ఉన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నదే తప్ప ఎన్డీఏ భాగస్వామి పార్టీగా దక్కవలసిన విలువ ఇవ్వడం లేదని రాజకీయ వర్గాల్లో ఒక వాదన ఉంది! దానికి తగ్గట్టుగానే ఎన్ డి ఏ ఇతర పార్టీలకు ఆహ్వానాలు పంపిన వేళకు జనసేనకు పిలుపు రాలేదు!!
ఆ వ్యవహారంపై జనసేన పార్టీలో కంగారు మొదలైంది. ఎన్డీఏ మీటింగ్‌కు పిలవకపోతే తమ పార్టీ పరువు పోతుంది- అని పవన్ కళ్యాణ్ భయపడ్డారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లు తనకు అత్యంత ఆత్మీయులు, స్నేహితులు అంటూ కలరింగ్ ఇస్తూ ప్రసంగాలు చేస్తూ, రాష్ట్ర పార్టీ నాయకులతో తనకేమీ ఖాతరు ఉండబోదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉండే పవన్ కళ్యాణ్- కనీసం పిలుపు కూడా రాకపోయేసరికి పరువు గురించి భయపడ్డారు.
ఢిల్లీలో తనకు అనుకూలురైన కమల నాయకుల ద్వారా ఆయన తన అసంతృప్తిని, భయాన్ని బిజెపి హైకమాండ్‌కు నివేదించినట్లుగా సమాచారం పర్యవసానంగానే జనసేన ను కూడా ఆహ్వానిస్తే పోయేదేముందని పిలుపు పంపారు.
నిజానికి ఎన్డీయేలో భాగస్వామిగా చేరకపోయినప్పటికీ తాను కూడా మోడీ భజనలో తరిస్తూ ఉన్నాడు గనుక తమకు కూడా పిలుపు వస్తే బాగుంటుందనే ఆశ చంద్రబాబునాయుడు లో కూడా ఉన్నట్లుంది. వచ్చే ఎన్నికలలో జగన్ వ్యతిరేక ఓటును గంపగుత్తగా తెలుగుదేశానికి అనుకూలంగా మలచుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేయకుండా వారిని మభ్యపెట్టడం అనేది చంద్రబాబుకు అత్యావశ్యకం.
ప్రస్తుతానికి ఎన్ డి ఏ భేటీకి పిలుపు రాకపోయి ఉండొచ్చు గానీ, ఆ తర్వాత అయినా సరే పార్టీ హై కమాండ్ ద్వారా రాష్ట్రంలో కమల దళాన్ని కూడా తన బుట్టలో పెట్టుకోవాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఆయనకు దిగుల్లేదు.
తన పల్లకి మోయడానికి జనసేనాని తొలినుంచి సిద్ధంగా ఉన్నారని ఆయనకు తెలుసు. బాబుకు పిలుపు రాకపోవచ్చు గానీ.. ఆయన తరఫు మాటలను ఎన్డీయే హైకమాండ్ కు తెలియజేయడానికి దత్తపుత్రుడు ఎటూ వెళ్తున్నాడు కదా.. అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.