గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారని మన్ననలు పొందుతున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారని టీడీపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. తద్వారా ఎన్నికల్లో టీడీపీకి పాజిటివిటీ పెరుగుతుందని ఆ పార్టీ ఆశించింది.
ఎలాగైనా ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని లోకేశ్ తహతహలాడారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, లోకేశ్ ఢిల్లీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో పలు దఫాలు పీకేతో లోకేశ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీకేతో లోకేశ్ చర్చించారు. అనంతరం విజయవాడకు పీకేని లోకేశ్ స్వయంగా తీసుకెళ్లి, తన తండ్రి చంద్రబాబుతో కలిపారు. దీంతో టీడీపీకి ఎన్నికల కోసం పీకే పని చేస్తున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడంపై పీకే వివరణ ఇచ్చారు. పీకే కామెంట్స్ టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎన్నికల్లో తమ కోసం పని చేయాలని చంద్రబాబు అడిగినట్టు పీకే వివరించారు. ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు పీకే వెల్లడించారు.
అసలు చంద్రబాబును ఎందుకు కలవాల్సి వచ్చిందో పీకే వివరించారు. బాబు, తనకు కామన్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పారు. తనను చంద్రబాబు కలవాలని కోరుతున్నట్టు కామన్ ఫ్రెండ్ తెలిపారన్నారు. ఎన్నికల కోసం పని చేయించుకోవాలని బాబు ఆశిస్తున్న విషయాన్ని తనకు స్నేహితుడు చెప్పాడన్నారు.
అయితే తానిప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదని సదరు స్నేహితుడికి వివరించినట్టు పీకే తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు నేరుగా చెప్పాలని కామన్ ఫ్రెండ్ కోరినట్టు పీకే వెల్లడించారు. ఫ్రెండ్ కోరినట్టు బాబును కలిసినట్టు పీకే వివరించారు. దీంతో చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చినట్టైంది. టీడీపీ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది.