భారత మీడియా రంగంలో అతిపెద్ద విలీనంగా చెప్పుకునే సోనీ-జీ సంస్థల కలయిక వీగిపోయింది. గడువు ముగియడంతో జీ గ్రూప్ తో విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు సోనీ కార్ప్ వెల్లడించింది. ఈ మేరకు జీ గ్రూప్ కు టెర్మినేషన్ నోటీసులు కూడా ఇచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ ఒప్పందం విలువ 10 బిలియన్ డాలర్లు.
2012, డిసెంబర్ 22న తొలిసారి విలీన ఒప్పందంపై సంతకం చేశాయి సోనీ-జీ కంపెనీలు. విలీన ప్రక్రియ కోసం 2023, డిసెంబర్ 21 వరకు గడువు పెట్టుకున్నాయి. నిర్దేశిత గడువులోగా విలీన ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇంకాస్త సమయం కావాలని సోనీని జీ గ్రూప్ కోరింది. నిన్నటితో ఆ గడువు కూడా ముగియడంతో ఒప్పంద ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్టు సోనీ ప్రకటించింది.
ఒప్పందం ప్రకారం జీ గ్రూప్ లో 50.86 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సోనీ ముందుకొచ్చింది. కంపెనీలో జీ వ్యవస్థాపకులైన సుభాష్ చంద్ర, పునీత్ గోయంకా వాళ్ల కుటుంబ సభ్యులకు 3.99శాతం వాటా ఉంది. 45.15 వాటాను మిగతా వాటాదారులు (పబ్లిక్ షేర్లు, సంస్థాగత వాటాదారులు) కలిగి ఉన్నారు. విలీనం సాకారమైతే ఐదేళ్ల పాటు కంపెనీకి పునీత్ గోయంకా సీఈవోగా ఉండాలనేది ఒప్పందం.
కానీ ఊహించని విధంగా పునీత్ గోయంకాపై అభియోగాలు నమోదయ్యాయి. రెగ్యులేటరీ కమిషన్ విచారణతో పాటు, కొన్ని లీగర్ ఇష్యూస్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి వ్యక్తిని సీఈవోగా కొనసాగించడానికి సోనీ గ్రూప్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఫలితంగా విలీన ప్రక్రియ మరింత ఆలస్యమై, చివరికి నీరుగారింది.
విలీనం సాకారమైతే దేశీయంగా రిలయన్స్ కు గట్టిపోటీ ఇచ్చేలా గ్రూప్ తయారయ్యేది. డిజిటల్ రంగంలో జీ గ్రూప్ మరింత ముందుకెళ్లేది. అంతేకాదు, కొన్ని సంస్థాగత అప్పుల నుంచి కూడా ఇది బయటపడేది. కానీ 10 బిలియన్ డాలర్ల ఖరీదైన ఈ మెగా ఒప్పందం సాకారం కాలేదు. ఒప్పందం రద్దవ్వడం వల్ల సోనీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేం లేదు కానీ జీ గ్రూప్ పరిస్థితి మాత్రం మళ్లీ మొదటికొచ్చినట్టయింది.