ఎ ఎమ్ రత్నం. ఎంత గొప్ప నిర్మాత. శంకర్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత. తరువాత కూడా మంచి సినిమాలు అందించారు. గ్రహపాటో, స్వీయ తప్పిదాలో ఆయనను వెనక్కు నెట్టాయి. అప్పుడెప్పుడో.. అల్లప్పుడెప్పుడో పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా మొదలైంది. నిజానికి ఈ సినిమా చకచకా పూర్తి చేసి వుంటే రెండు వందల కోట్లకు పైగా మార్కెట్ జరిగి వుండేది. ఎంత భారీగా ఖర్చు చేసినా, ఎఎమ్ రత్నం చేతిలో కనీసంలో కనీసం పాతిక కోట్లు మిగిలి వుండేవి. ఆయన ఆర్ధిక కష్టాలు అన్నీ గట్టేక్కేసేవి.
కానీ అలా జరగలేదు. అసలు లోపం ఎక్కడ వుందో ఎవరికీ తెలియదు. క్రిష్ స్కిప్ట్ లో లోపమా? రత్నం ఫైనాన్సియల్ సమస్యలా? పవన్ ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి ఎందుకు కనబర్చడం లేదు? అసలు ఈ సినిమా ఎప్పటికైనా పూర్తవుతుందా? ఈసినిమా ఒప్పుకున్న తరువాత, ఇప్పటికి రెండు సినిమాలు ప్రారంభించి, విడుదల చేసారు పవన్. మూడో సినిమా కూడా ఫినిష్ చేసారు. అది ఈ నెలలో విడుదల కాబోతోంది. నాలుగో సినిమా సగానికి పైగా పూర్తయిపోయింది.
మరి కేవలం హరి హర వీరమల్లుకు మాత్రమే ఈ పరిస్థితి ఎందుకు? దీనికి కారణం పవన్..క్రిష్..రత్నం..వీరిలో ఎవరు? సమాధానం లేదు.
ఇలాంటి టైమ్ లో ఎ ఎమ్ రత్నం ఆర్థికంగా చాలా నలిగిపోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి ఎంత వరకు నిజం అన్నది రత్నంగారికే తెలియాలి. ఈ మధ్య ఎవరో ఆయన సినిమా ఒకదాన్ని రీరిలీజ్ చేస్తామని హక్కుల కోసం సంప్రదించారని తెలుస్తోంది. ఖర్చులు అన్నీ పెట్టుకుని రీ రిలీజ్ చేయడానికి ‘ఆ పర్టిక్యులర్’ సినిమాకు జస్ట్ యాభై లక్షలు ఇస్తే చాలని ఎఎమ్ రత్నం అడిగినట్లు తెలుస్తోంది. ఓకె అన్న పార్టీ ఎంతకూ మళ్లీ స్పందించకపోవడంతో కనీసం ముందుగా ఓ పది లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని కోరినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
తలుచుకుంటే బాధగా వుంటుంది. ఎంత పెద్ద నిర్మాత. ఎన్ని బ్లాక్ బస్టర్లు ..కానీ ఇవ్వాళ పరిస్థితి చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. ఇప్పటికైనా పవన్ తలుచుకుంటే రత్నం ను బయటపడేయడం పెద్ద కష్టం కాదు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.