భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బహుశా షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకునే ఉండాలి! ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇన్ డైరెక్ట్ గా సానియా ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించింది. వారిద్దరూ విడిపోయారనే వార్తలు చాన్నాళ్లుగానే వస్తున్నాయి రూమర్లుగా!
ఆ సంగతలా ఉంటే.. షోయబ్ మాలిక్ మొత్తానికి మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ సారి అతడు ఒక పాక్ టీవీ నటిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఫొటోలను పోస్టు చేసి, పెళ్లి విషయాన్ని ధృవీకరించాడు. మరి ఈ పెళ్లితో అప్పటికే సానియాతో షోయబ్ విడాకులు తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.
2010లో నాటకీయ పరిస్థితుల మధ్యన సానియా, షోయబ్ లు పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఒక హైదరాబాదీ యువకుడితో నిశ్చితార్థం చేసుకున్న సానియా దాన్ని రద్దు చేసుకుని ఈ పాక్ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే షోయబ్ మాలిక్ కు కూడా ఒక పెళ్లైంది. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి షోయబ్ సానియాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సానియా, షోయబ్ ల జంట కాపురం చాన్నాళ్ల పాటే సాగింది. ఒక కొడుకు కూడా ఉన్నట్టున్నాడు. ఆ తర్వాత వీరి విడాకులపై రూమర్లు మొదలయ్యాయి. దుబాయ్ వేదికగా వీరిద్దరూ పలు సార్లు జంటగా కనిపించారు. రూమర్లే నిజమై వీరు విడాకులు తీసుకున్నట్టుగా ఉన్నారు.
సోషల్ మీడియా బయోగ్రఫీలో తమ దాంపత్యం గురించిన వాక్యాలను వీరు మార్చేసుకున్నారు. తనయుడి కోసం మధ్యమధ్యలో కాస్త కలిసి కనిపించారు. ఇప్పుడు షోయబ్ మాలిక్ పెళ్లితో వీరి విడిపోయిన విషయం స్పష్టం అవుతోంది.