టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో రాజకీయం మామూలు వ్యవహారం కాదు. ఆయనది దృతరాష్ట్ర కౌగిలి అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇప్పుడు బాబు రాజకీయ కౌగిలిలో జనసేనాని పవన్‌కల్యాణ్ బందీ అయ్యారు. ఇక బయట పడడం పవన్ చేతల్లో లేదు. బాబు దయతలస్తేనే …పవన్‌కు ఊపిరాడుతోంది.
పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చే సీట్లు, అవి కూడా ఎక్కడెక్కడ అనే విషయమై జనసేనలో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. జనసేనకు 25 నుంచి గరిష్టంగా 30 సీట్లు మాత్రమే ఇవ్వనున్నట్టు టీడీపీ వ్యూహాత్మకంగా లీకులు ఇస్తోంది. జనసేనకు ఇవి గౌరవప్రదమైన సీట్లు కానే కాదని కాపు ఉద్యమ నాయకులు చెబుతున్నారు. ముందుగా సీట్లు, అధికారంలో భాగస్వామ్యంపై బాబుతో తేల్చుకోవాలని పవన్‌కు కాపు ఉద్యమ నాయకులు హితబోధ చేస్తున్నారు.
కనీసం 40కి తక్కువ కాకుండా సీట్లు ఇస్తేనే జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ జరుగుతుందని కాపు ఉద్యమ నాయకులు బహిరంగంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. టీడీపీ చెబుతున్నట్టు 25 లేదా 30 సీట్లు మాత్రమే ఇస్తే, కాపుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు వార్నింగ్ ఇస్తున్నారు.
మరోవైపు చంద్రబాబు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. చాలా మందికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు తమను మోసగిస్తున్నారన్న అనుమానం జనసేనలో అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరితో విసిగి వేసారిన జనసేన, కాపు ఉద్యమ నేతలు …తమకు తామే 50 మంది అభ్యర్థులతో జాబితాను తెరపైకి తెచ్చారు.
పవన్‌కల్యాణ్‌తో సహా జనసేన ముఖ్య నేతలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ జాబితాలో పొందుపరచడం విశేషం. పవన్‌కు తిరుపతి, భీమవరం తదితర చోట్ల సీట్లు కేటాయించారు. అలాగే తెనాలిలో నాదెండ్ల మనోహర్‌కు, విజయవాడ వెస్ట్‌లో పోతిన మహేశ్ తదితరులకు సీట్లు ఖరారు చేస్తూ విడుదల చేసిన జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో జనసేన అభ్యర్థుల్లో ఆశలు మరింతగా పెరిగాయి. ఒకవేళ రేపు టీడీపీ-జనసేన విడుదల చేసే జాబితాలో వీళ్లకు టికెట్లు దక్కకపోతే మాత్రం రచ్చే. ఎందుకంటే టికెట్‌పై ఆశ పెంచి, పొత్తు సాకుతో ఇవ్వకపోతే జీర్ణించుకునే పరిస్థితి వుండదు. సీట్లు, నియోజకవర్గాల కేటాయింపుల్లో జాప్యం వల్లే నష్టం కలుగుతోందని జనసేన వాపోతోంది. అందుకే తామే ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటున్నట్టు వారు చెబుతున్నారు.