జనసేనతో టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ, రాజకీయంగా పవన్‌ను ఎదగనివ్వకూడదని చంద్రబాబునాయుడి లక్ష్యం. ఇందుకు తగ్గట్టుగానే బాబు పక్కా ప్రణాళిక రూపొందించారు. పొత్తులో భాగంగా పవన్‌కల్యాణ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతలోని లోతును గమనిస్తే… పవన్‌ను కేవలం ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలకే కట్టడి చేయడం.
రాష్ట్ర వ్యాప్తంగా పవన్‌కల్యాణ్‌ను వెంట తిప్పుకునే పిచ్చి ఆలోచన చంద్రబాబు చేయరని టీడీపీ నేతలు అంటున్నారు. పవన్‌కల్యాణ్‌కు అంతోఇంతో బలం వున్నది కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే అని టీడీపీ నమ్ముతోంది. అంతోఇంతో విశాఖలో పవన్ సామాజిక వర్గం ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. అందుకే పవన్‌ను అక్కడికే పరిమితం చేయాలని చంద్రబాబు వ్యూహం రచించారు.
ఇదే విషయాన్ని జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పడం గమనార్హం. ఈ నెల 25న అమలాపురంలో ప్రచారానికి పవన్‌కల్యాణ్ శ్రీకారం చుడతారన్నారు. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో పవన్ ఎక్కువగా పర్యటిస్తారని ఆయన చెప్పడం విశేషం. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండు రోజులు పర్యటిస్తారని ఆయన చెప్పారు.
పవన్‌కల్యాణ్ పర్యటనలకు సంబంధించి నాదెండ్ల వివరాలు వెల్లడించినప్పటికీ, స్క్రిప్ట్ మాత్రం టీడీపీదే. చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టే పవన్ నడుచుకుంటున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్‌తో ప్రచారం చేయించుకోవడానికి ఇబ్బంది ఏంటి? అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ప్రభావితం చేసేంత సీన్ లేదని టీడీపీ సమాధానం ఇస్తోంది. మరీ ముఖ్యంగా జనసేనకు ఇచ్చే సీట్లు కూడా ఆ నియోజకవర్గాల్లోనే వుంటాయని చెబుతున్నారు. అందుకే అక్కడ గెలిపించుకుంటే చాలనే రీతిలో టీడీపీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.