జూ ఎన్.టి.ఆర్ అంటే బాలయ్యకి భయమా కోపమా?

మళ్లీ పాత కథే. జూ ఎన్.టి.ఆర్ ఫ్లెక్సీ గొడవ. ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీ ఒకదానిని తొలగించమని బాలకృష్ణ పక్కనున్న వాళ్లకి ఆదేశాలు జారీ చేయడం వాళ్లు తొలగించడం జరిగింది.  Advertisement ఎన్.టి.ఆర్…

మళ్లీ పాత కథే. జూ ఎన్.టి.ఆర్ ఫ్లెక్సీ గొడవ. ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీ ఒకదానిని తొలగించమని బాలకృష్ణ పక్కనున్న వాళ్లకి ఆదేశాలు జారీ చేయడం వాళ్లు తొలగించడం జరిగింది. 

ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద పెద్దాయన జయంతికి, వర్ధంతికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు రావడం నివాళులర్పించడం సహజం. ఆ సందర్భంలో అభిమానులు, పార్టీ వారు బయట ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి స్వాగతించడం మామూలే. 

ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు..అభిమానుల కార్యక్రమం… కుటుంబ సభ్యుల నివాళి. 

నందమూరి బాలకృష్ణకి, హరికృష్ణకి, చంద్రబాబుకి, లోకేష్ కి, తారకరత్నకి ఇలా ప్రతి కుటుంబ సభ్యుడికి అభిమానులుండొచ్చు. ఈ మధ్యనే బయటికొచ్చి తమ వాగ్ధాటిని చాటుకున్న చైతన్యకృష్ణకి, లోకేశ్వరి కుమారుడుకి కూడా అభిమానులుండొచ్చు. కాదనడానికి ఎవరికి మాత్రం హక్కుంది? 

ఆయా అభిమానులు వాళ్లకు నచ్చినట్టు ఫ్లెక్సీలు అవీ కడతారు. అలాగే నందమూరి వారసుడైన జూ ఎన్.టి.ఆర్ ఫ్లెక్సీ కూడా పెట్టారు. 

నచ్చితే కళ్ళెత్తి చూడొచ్చు. నచ్చకపోతే చూసీ చూడనట్టు వదిలేయొచ్చు. అంతేకానీ ఆ ఫ్లెక్సీ ఉండడానికి వీల్లేదని..కనుక పీకేయమని ఆదేశించడంతోనే పిలిచి తద్దినం పెట్టించుకున్నట్టయ్యింది. 

అయినా అంతలా పీకేమని చెప్పడానికి బాలకృష్ణకి జూనియర్ అంటే భయమా, కోపమా లేక అసహ్యమా? 

సింపుల్..తాము పిలిచినప్పుడల్లా వచ్చి మాట్లాడమన్నట్టల్లా మాట్లాడితే అసహ్యముండదు! 

తమ కాలికింద చెప్పులా పడుండి తన అల్లుడి రాజకీయ సింహాసినానికి ఎసరు పెట్టడన్న నమ్మకముంటే కోపముండదు. 

పై రెండూ జరగట్లేదు కనుకనే భయం అనుకోవాలి. 

తండ్రిని వెన్నుపోటు పొడిచినా అదొక చారిత్రక అవసరం అనుకుంటూ చంద్రబాబు వెనుకే నడిచి, అతనితో వియ్యం కూడా అందిన మహానుభావుడు బాలకృష్ణ. 

తన బావగారు తనకి, తన భర్తకి రాజకీయ ప్రాధాన్యం లేకుండా పక్కకు నెట్టేసినా ప్రసన్నంగా నవ్వుతూ అదే కుటుంబాన్ని అంటి పెట్టుకుని ఉన్న విశాల హృదయురాలు చిన్నమ్మ పురందేశ్వరి. 

తన తండ్రిని సైడ్ ట్రాక్ పట్టించి అసలు ఉనికిలో లేకుండా చేసినా చంద్రబాబు పంచనే చేతులుకట్టుకుని బతికేస్తున్న సహృదయుడు నారా రోహిత్. 

అసలు చంద్రబాబు కుయుక్తిని, అవకాశవాదాన్ని, స్వార్ధాన్ని రుచి చూసి ధిక్కరించిన మొదటి వ్యక్తి పెద్దాయన ఎంటీయార్. 

అదే తాత రక్తం ప్రవహించడం వల్ల కొంత, చంద్రబాబు అవకాశవాదాన్ని రుచి చూడడం వల్ల ఇంకొంత.. పెద్దాయన తర్వాత బాబుని ధిక్కరిస్తున్నటువంటి ఏకైక 

కుటుంబ సభ్యుడు జూనియర్ ఎన్.టి.ఆర్. అతనిని అర్ధం చేసుకుని ఎవరేమనుకున్నా అతని పంచనే ఉంటున్న సోదరుడు కళ్యాణ్ రాం. 

సొంత బలంపై నమ్మకున్నవాడు చంద్రబాబుని అతనిని ఆశ్రయించుకుని బ్రతుకుతున్నవారిని పక్కనపెడతాడు. ఆ నమ్మకంలేని వాళ్లు చేసేది లేక పడుంటున్నారు అనిపిస్తుంది చూస్తున్నవారికి.  

ఈ రోజు కొడాలి నాని ఈ ఫ్లెక్సీ గొడవ గురించి స్పందిస్తూ ఘాటుగా మాట్లాడాడు. అతను మాట్లాడితే చాలామంది తెలుగుతమ్ముళ్లు చెవులు మూసుకుంటారు. ఎందుకంటే అతని మాటల్లోని లాజిక్ కి కౌంటర్ వేసుకోలేక… చేదుగా అనిపించే ఆ నిజాలని మింగలేక. వాళ్ల దృష్టిలో తమకి నచ్చనది ఏది విన్నా అది బూతే. అందుకే నాని మాట్లాడేవన్నీ బూతులే అనుకుంటుంటారు పాపం!

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తమ సొంత డబ్బుతో తన మిత్రుడి స్థలంలో కొడాలి నాని, జూనియర్ ఎన్.టి.ఆర్ కలిసి పెద్దాయన ఎన్.టి.ఆర్-బసవతారకమ్మ ల విగ్రహం పెట్టారట నిమ్మకూరులో. అటువైపుకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఆ విగ్రహానికి దండేసి, ఫొటో దిగి వెళ్ళేవాడట. నిజానికి అది ప్రైవేటు స్థలంలో ఉన్న విగ్రహం. ఎవరి అనుమతి తీసుకుని వెళ్లి దండేశాడు అని కొడాలి నాని గానీ, జూనియర్ ఎన్.టి.ఆర్ గానీ, ఆ స్థలం ఓనరైన వ్యక్తి గాని చంద్రబాబుని నిలదీయొచ్చు. కానీ తమకి సంస్కారముంది కాబట్టి ఆ పని చెయ్యలేదు అని చెప్పాడు కొడాలి నాని. 

మరో పక్క చూస్తే ఎన్.టి.ఆర్ ఘాట్ ప్రైవేట్ ఆస్తి కాదు. అది గవర్నమెంటు స్థలం. పెద్ద ఎంటీయార్ కి నాచారంలో రామకృష్ణ సినీ స్టూడియో ఉన్నా, సొంత ల్యాండులు ఎన్నో ఉన్నా తమ కుటుంబసభ్యులు అవేవీ వేస్టై పోకూడదని ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి హుస్సేన్ సాగర్ ఎదురుగా, సెక్రటేరియట్ పక్కన ప్రైం ల్యాండుని ఎంటీయార్ సమాధికి కేటాయించేసుకున్నారు. అక్కడే ప్రతి ఏడూ రెండు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. మామూలు రోజుల్లో సందర్శకులు వస్తుంటారు. అలాంటి చోట ఫలానా ఫ్లెక్సీని ఉంచాలో తీసెయ్యాలో నిర్ణయించడానికి బాలకృష్ణ ఎవడు అనేది నాని ప్రశ్న. 

ఇదంతా చెబుతూ బాలకృష్ణ కి మెంటలుందని డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ ఉందని, అందుకే ఇలాంటి తలకాయలేని పనులు చేస్తున్నాడని, అతనిని పిచ్చాసుపత్రిలో పెట్టాలి కానీ ఇలా బయట వదిలేస్తే ఎలా అని అంటున్నాడు. 

“పిచ్చి సర్టిఫికేట్” అనగానే బెల్లంకొండ సురేష్ పై బాలకృష్ణ కాల్పుల ఘటన గుర్తొస్తుంది. అలా గతాన్ని గుర్తి చేయించుకుని, ఇన్నేసి మాటలు పడడం అవసరమా బాలకృష్ణకి? అసలు పట్టించుకోకుండా వదిలేసుకుంటే ఇలా చిన్నబోయే పరిస్థితి ఉండేది కాదు కదా! అక్కర్లేని, అక్కరకురాని శాసనాలు దేనికి? 

రాజకీయాల్లో ప్రధానమైన అంశం..అనవసరమైన పనులు చేసి ప్రత్యర్ధులకి మాటల దాడి చేసే అవకాశమివ్వకపోవడం. 

ఈ ప్రాధమిక సూత్రం బాలయ్యకి తెలియట్లేదు. టీవీలోనూ బయటా కూడా తాను అన్-స్టాపబుల్ అనుకుంటే ఎలా? 

“హాయిగా కారు వెనుక సీట్లో కూర్చుని దర్జాగా వెళ్లేవాడివి. ఖర్చై పోయి డిక్కీలో తొంగున్నావు. దర్జా తగ్గిపోలా” అని ముత్యాలముగ్గులో డైలాగులాగ

ఇక్కడ బాలకృష్ణ పరువుని కొడాలి నాని డొక్కలో తన్ని డిక్కీలో వేసేసాడు. ఇప్పుడు మనం “బాలయ్య దర్జా తగ్గిపోలా!!!” అనుకోవాలి. 

ఎన్నికలయ్యే వరకు బాలయ్య కాస్త సంయమనం పాటిస్తే మంచిది! అనవసరంగా రియాక్టు కాకూడదు. ఆ ఫ్లెక్సీలు పెట్టింది జూనియర్ అభిమానుల ముసుగులో ఉన్న వైకాపా వారు కూడా కావొచ్చు. రాజకీయాన్ని అన్ని కోణాల్లోనూ చూడాలి. రెచ్చకొడితే రెచ్చిపోయేవాడు రాజకీయానికి పనికిరాడు. 

హరగోపాల్ సూరపనేని