ఔరా.. రాజు గారి సీటుకే ఎసరా…!?

విజయనగరం సీటు అంటే రాజా వారిదే. ఇది నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో వస్తున్న ఆచారం. ఆ సీటుని ఎవరికీ కేటాయించడంలేదు. దాని కోసం ఎవరు ఆశపడినా అది అడియాసే అవుతుంది అన్నది తెలిసిందే. ఆ…

విజయనగరం సీటు అంటే రాజా వారిదే. ఇది నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో వస్తున్న ఆచారం. ఆ సీటుని ఎవరికీ కేటాయించడంలేదు. దాని కోసం ఎవరు ఆశపడినా అది అడియాసే అవుతుంది అన్నది తెలిసిందే. ఆ సీటుని ఇపుడు జనసేన ఖాతాలో వేయడానికి కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఉబలాటపడుతున్నారు.

ఆయన జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఆ జాబితా ఏంటో కూడా ఆయన లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. అందులో అనూహ్యమైన సీట్లు కూడా ఉన్నాయి. విజయనగరం అసెంబ్లీ సీటుని కూడా జనసేనకు కేటాయించాలంటూ జోగయ్య తన లిస్ట్ లో పేర్కొనడం విశేషం.

అశోక్ అయితే తనకు ఎమ్మెల్యే సీటుతో పాటు తన కుమార్తెకు విజయనగరం ఎంపీ సీటు కూడా కోరనున్నారని అంటున్నారు. ఆ పంచాయతీ అలాగే ఉంది. ఇపుడు అశోక్ సీటుకే ఎసరు పెట్టేలా జోగయ్య జాబితా ఉందని అంటున్నారు.

ఆ సీటుని విజయనగరం జనసేన నేత గురాన అయ్యలుకు ఇవ్వాలని అభ్యర్ధి పేరుని కూడా జోగయ్య ప్రకటించారు. ఇక మీసాల గీత ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. ఆమె విజయనగరం సీటు కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. 2014లో ఆమె టీడీపీ నుంచే ఆ సీటు గెలిచారు. 2019 వచ్చేనాటికి ఆ సీటుని అశోక్ కుమార్తెకు ఇచ్చారు. ఇపుడు అశోక్ పోటీకి సిద్ధం అయ్యారు.

విజయనగరంలో తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారంతా బీసీ కేటగిరీ కిందకే వస్తారు. బీసీలకు విజయనగరం సీటు కేటాయించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇపుడు జోగయ్య అదే మాటను వినిపిస్తున్నారు. దీని మీద జనసేన టీడీపీ ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది.