తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో షర్మిల సీరియస్‌గా విభేదించి, రాజకీయాలు చేస్తున్నారా? లేక ఇద్దరి మధ్య ఏదైనా అవగాహనతో కథ నడుపుతున్నారా? అనే చర్చకు తెరలేచింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో గురువారం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు.
అన్నాచెల్లెళ్ల మధ్య తీవ్ర విభేదాలున్నాయని, ఒకరికొకరు చూసుకోడానికి, మాట్లాడుకోడానికి కూడా ఇష్టపడడం లేదని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు జగన్ వెళ్తారా? లేదా? అనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. ఇలాంటి ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ జగన్ హైదరాబాద్‌కు వెళ్లనున్నట్టు షెడ్యూల్ విడుదల చేశారు. షర్మిల కుమారుడి వేడుకకు జగన్ వెళ్లరని ఆశించిన ప్రత్యర్థులకు నిరాశే ఎదురైంది.
రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్థానికి వెళ్లకుంటే, వాళ్లిద్దరి మధ్య విభేదాలను బూతద్దంలో తప్పక చూపేవారు. అయితే జగన్, షర్మిల తీవ్రస్థాయిలో ద్వేషించుకుంటున్నారనే ప్రచారం ఒకవైపు, మరోవైపు అన్నాచెల్లెళ్లు ఆనందంగా కలుసుకోవడం మరోవైపు ….దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రత్యర్థులకు, గిట్టని వారికి అర్థం కావడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్లిద్దరూ డ్రామాలు ఆడుతున్నారా? అనే అనుమానం లేకపోలేదు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలతో జగన్ రాజకీయ నాటకం ఆడిస్తున్నారా? అని శంకించే వాళ్లు లేకపోలేదు. ఇప్పటికే మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడాన్ని విస్మరించొద్దు. అందుకే షర్మిలకు కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని అప్పగించొద్దని ఆయన డిమాండ్ చేశారు.
జగన్, షర్మిల అన్యోన్యత గురించి తెలిసిన వారెవరైనా.. వాళ్లిద్దరూ శత్రువుగా వ్యవహరిస్తారంటే నమ్మరు. నిజంగా వాళ్లిద్దరూ పరస్పరం ద్వేషించుకునే పరిస్థితే వుంటే, జగన్ అటు వైపు తొంగి చూడడని చెబుతున్నారు. జగన్‌కు నచ్చలేదంటే, పొరపాటున కూడా రాజీపడే ప్రసక్తే వుండదని అంటున్నారు. అందుకే షర్మిలతో జగన్ విభేదాలపై అందరి అనుమానం.