ఏపీలో ఎన్నికలంటే అధికారులు హడలిపోతున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికార పార్టీ నియమించుకోవడం సర్వ సాధారణమే. అయితే ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎపిసోడ్‌లో వివిధ శాఖల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్రం ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.
2021లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి అక్రమంగా డౌన్‌లోడ్ చేసి, దొంగ ఓట్లు వేసుకున్న వ్యవహారంలో అధికార పార్టీకి సహకరించారనే కారణంతో నాటి తిరుపతి కమిషనర్, నేటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు వేయడంతో అధికారుల్లో భయం పట్టుకుంది. గిరీషా ఐడీతో వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసినట్టు ఎన్నికల సంఘం విచారణలో వెల్లడైంది. ఈ ఎపిసోడ్‌లో ఇంకా పలువురు అధికారులపై వేటు వేసే అవకాశం వుంది.
పోస్టింగ్‌ల కోసమో, ఇతరేతర ప్రయోజనాల కోసం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోతే, అసలుకే ఎసరు వస్తుందనే భయం అధికారులను వెంటాడుతోంది. దీంతో ఎన్నికల్లో తాము చెప్పినట్టు వినాలనే షరతు విధిస్తే వెళ్లడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో తమకు అనుకూలమైన పోలీస్ అధికారుల్ని నియమించుకోవడం అధికార పార్టీ నేతలకు సవాల్‌గా మారింది.
ఈ సమయంలో తాము రాలేమని, పార్టీ ముద్ర వేయించుకోలేమని సమాధానం ఇస్తున్నారని తెలిసింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఎన్నికల సమయంలో కీలక బాధ్యతల్ని తీసుకుని, అధికార పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా చేశామనే పేరు తెచ్చుకోడానికి చాలా మంది అధికారులు తటపటాయిస్తున్నారు.
ఇదంతా తమకెందుకని, ఈ రెండు మూడు నెలలు అప్రాధాన్య పోస్టుల్లోకి వెళ్లడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. ఇంతకాలం అధికారాన్ని అనుభవించిన కొందరు నేతలు, కీలకమైన ఎన్నికల సమయంలో తప్పించుకోవడంపై అధికార పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే… అమ్మో, ఎన్నికలకో దండం అని ముక్తసరిగా సమాధానం ఇస్తున్నారని వైసీపీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.