టాలీవుడ్‌లో పైకి చెప్పే సంగతులు వేరు. లోపలి సంగతులు వేరు. రాజమౌళి సినిమా అయినా సరే సక్సెస్ అంటే అంగీకరించడం చాలా అరుదు. పైకి మాట్లాడేది వేరు. లోపల చెప్పేది వేరు. సినిమాలు ఆడాలి. ఇండస్ట్రీ బతకాలి. ఇలాంటి కబుర్లు అన్నీ పైకే. లోలోపల మాత్రం సన్నాయి నొక్కులు వుంటాయి. అంతకు మించీ వుంటాయి. ఆ ఏముందీ సినిమాలో.. అస్సలు ఆడడం లేదట కదా.. ఆడి దగ్గర విషయం అయిపోయింది.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తూ వుంటాయి ఇన్నర్ సర్కిళ్లలో.
ఓ దర్శకుడు ట్వీట్ వేసారు. ఒకరి ఫ్లాపుకు మీరు ఆనందిస్తే, మీ ఫ్లాప్‌కు వేరేకొరు ఆనందిస్తారు అనే అర్థం వచ్చేలా. అది ముమ్మాటికీ నిజం. అందులోనూ దర్శకుడు త్రివిక్రమ్‌కు ఫ్లాప్ వస్తే చాలా అంటే చాలా మంది ఆనందిస్తారు. అది ముమ్మటికీ నిజం. ఎందుకంటే త్రివిక్రమ్ వ్యవహారాలు అలా వుంటాయి.
ఓ పెద్ద బ్యానర్ అయినా అందరితో సినిమాలు చేయాలనుకుంటుంది. కానీ హారిక హాసిని బ్యానర్‌కు పెద్ద దర్శకులు అంతా దూరమే. కొరటాల శివ, సుకుమార్ ఇలాంటి టాప్ లైన్‌లో వున్నవారంతా అక్కడ సినిమాలు చేయరు. ఎందుకు చేయరు అంటే ఆ బ్యానర్ కేవలం త్రివిక్రమ్ కే. సితార బ్యానర్ లో చేస్తాము అనేది నిర్మాతలు పెట్టుకున్న ఓ పద్దతి. పవన్ కళ్యాణ్‌తో చేసిన భీమ్లా నాయక్ అయినా సితార బ్యానర్ నే. ఎందుకంటే దర్శకుడు త్రివిక్రమ్ కాదు కనుక.
హారిక హాసిని పెద్ద బ్యానర్.. సితార దాని సెకండరీ బ్యానర్. అందువల్ల ఇందులో చేయడం అన్నది కాస్త చిన్నగా ఫీల్ అవుతారు పెద్ద దర్శకులు అందరూ. కానీ హారిక హాసిని కావచ్చు, సితార కావచ్చు. ఇవన్నీ త్రివిక్రమ్ పుణ్యమే. ఆయన వల్లే హీరోలు వచ్చారు. సినిమాలు చేసారు. హిట్ లు చేసుకుని, కాస్త బలమైన బ్యానర్లుగా నిలబడ్డారు.
సితారలో మంచి సినిమాలు వచ్చాయి. మంచి హిట్ లు వచ్చాయి. కానీ మిగిలిన పెద్ద దర్శకుల వరకు ఒక అభిప్రాయం వుంది. చేస్తే హారిక బ్యానర్ లో చేద్దాం. లేదంటే లేదు అని. అది వాస్తవం. తమకు అవసరమే లేదు అనే భావన హారిక హాసిని అధినేతలది. ఎందుకంటే వాళ్లకు త్రివిక్రమ్ కావాలి.
అలాగే త్రివిక్రమ్‌కు నచ్చని వాళ్లు నటులు అయినా, సాంకేతిక నిపుణులైనా సరే, వాళ్లకి సితార, హారిక హాసిని సంస్థ సిన్మాల్లో అవకాశాలు వుండవు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా త్రివిక్రమ్ నే కంట్రోలు చేస్తున్నారనే గ్యాసిప్ వుంది. మైత్రీ కి తీసుకున్న అడ్వాన్స్ ను వడ్డీతో సహా వెనుక్కు ఇవ్వాల్సి వచ్చింది త్రివిక్రమ్. అందుకే మైత్రీ-పవన్ సినిమా నత్తనడక నడుస్తోంది అనే గ్యాసిప్ కూడా వుంది.
వీటన్నింటి వల్లా తనకు తెలియకుండానే త్రివిక్రమ్ చాలా మందికి కిట్టని దర్శకుడు అయ్యారు. త్రివిక్రమ్ కు తెలియకపోవచ్చు. ఇండస్ట్రీ దర్శకుల ఇన్ సైడ్ సర్కిళ్లలో ఆయనకు ఓ కోడ్ నేమ్ వుంది. అది ‘శ్వేతనాగు’. కొంతమంది దర్శకులు నేరుగా త్రివిక్రమ్ అని మాట్లాడుకోకుండా ‘శ్వేతనాగు’ అనే పదం వాడతారు అన్నది ఆ ఇన్ సైడ్ సర్కిళ్లకు దగ్గరగా వుండేవారికి తెలిసిన సంగతి.
మరి ఈ నామకరణం ముందుగా ఎవరు చేసారో? ఎలా ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తూ వుంటుందో అన్నది తెలియదు. ఇప్పుడు త్రివిక్రమ్ కు ఫ్లాప్ పడేసరికి ఇండస్ట్రీలో చాలా మంది డ్యాన్స్ చేస్తున్నారు. గుణశేఖర్ తన హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ కు త్రివిక్రమే నే బ్రేక్ వేసారనే విధంగా గతంలో మాట్లాడారు. ఇలా బయటకు తెలిసినవి, తెలియనివి చాలానే వున్నాయి. వుండే వుంటాయి. అందుకే ఇవన్నీ కలిసి యావరేజ్ గుంటూరు కారం సినిమాను డిజాస్టర్ గా మర్చేసాయి. మార్చేస్తున్నాయి.
పైగా త్రివిక్రమ్ కూడా అలాంటి నాసిరకం సరుకు అందించారు. పట్టమని పది పేజీల సరైన డైలాగులు రాయలేదు. ఏ పాత్రను పరిపూర్ణంగా డిజైన్ చేయలేదు. మహేష్ బాబు కాకుండా అయితే ఈ సినిమా ఇంకా డిజాస్టర్ అయ్యేది. మహేష్ తన భుజాల మీద ఈ మాత్రం లాక్కు వచ్చారు.