కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి భలే చాన్స్ దక్కించకున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి రేణుకాచౌదరిని అధిష్టానం ఎంపిక చేయడం విశేషం. ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను రేణుకా చౌదరి ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్థానం నుంచి కాంగ్రెస్ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఖమ్మం గ్యారెంటీ కాంగ్రెస్ గెలుపు సీటు కావడంతో పోటీ ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపడం ద్వారా కొంత వరకు సమస్య తీరినట్టు అవుతుందని కాంగ్రెస్ భావన. రాజ్యసభకు పంపుతున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం రావడంతో ఆమె నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని కమ్మ నాయకురాలైన రేణుకా చౌదరి అధిష్టానం వద్ద పట్టు పట్టారు. తెలంగాణలో 30 స్థానాల్లో గెలుపోటములపై కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపుతుందని ఆమె లెక్కలు చెప్పారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తలొగ్గలేదు. తాజాగా రాజ్యసభ పదవితో ఆమెను కాంగ్రెస్ పార్టీ సంతృప్తిపరిచింది. టీడీపీ నుంచి ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఎవరినైనా అలవోకగా విమర్శించగల నాయకురాలిగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఆమె తాపత్రయపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై పలు మార్లు ఘాటు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఏపీలో పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. అలాగే ఏపీలో ప్రచారం కూడా చేస్తానన్నారు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ఆ మధ్య తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభ దక్కించుకున్న రేణుకా చౌదరి రానున్న రోజుల్లో ఎప్పట్లాగే టీడీపీ కోసం పని చేస్తారా? అనేదే ప్రశ్న.