జనసేన రాజకీయ పంథా భలే నవ్వు తెప్పిస్తోంది. ఎన్నికల సమయంలో వేడెక్కుతున్న రాజకీయం… పవన్ కామెడీ పుణ్యమా అని వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చిన్న పిల్లల చేష్టలు చూసి ఆ పార్టీ శ్రేణులకు నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితి.
ఈ నెల 14నుంచి నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌కల్యాణ్ పర్యటించాలని భావించారు. ఈ మేరకు పవన్ పర్యటన షెడ్యూల్ కూడా విడుదలైంది. కనీసం అప్పుడప్పుడైనా జనంతో, అలాగే తన పార్టీ నాయకులతో మమేకం అవుతున్నాడని అందరూ అనుకున్నారు. మొట్టమొదట ఆయన భీమవరంలో పర్యటించాలని అనుకున్నారు.
భీమవరంలో పవన్‌కల్యాణ్ హెలీకాప్టర్ దిగడానికి ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో భీమవరం పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత పర్యటనలు యధావిధిగా కొనసాగుతాయని జనసేన ప్రకటించింది. భీమవరం పర్యటన రద్దైనా, తమ ప్రాంతాలకు వస్తున్నాడనే జనసేన నాయకులు, కార్యకర్తల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. చావు కబురు చల్లగా ప్రకటించడం గమనార్హం.
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఏముందంటే…
“జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు పవన్ సూచించారు”
పవన్ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ భావిస్తుందని అనుకుందాం. ఆ పార్టీ ఆలోచనలకు తగ్గట్టే జనసేన నడుచుకోవడం ఏంటి? కాకినాడకు 30 కి.మీ దూరంలో హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇస్తే, దానికి అలకబూనడం ఏంటి? అసలు పర్యటించాలనే సంకల్పం వుంటే, ఇలాంటి అడ్డంకులను పట్టించుకోవాల్సిన అవసరం వుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్‌పై అలిగి చివరికి తమకు తామే నష్టం కలిగించుకుంటున్నామన్న స్పృహ జనసేనలో కొరవడింది. ఎంతసేపూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండా ఉండేందుకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.
నాలుగు రోజుల పర్యటనలు రద్దు చేసుకుని, అవే సమావేశాలను మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడానికి నిర్ణయించడమే ఇందులో ట్విస్ట్. ఈ పర్యటనలకు సంబంధించి నిధులు ఒక పార్టీ నుంచి అందకపోవడం వల్లే రద్దు చేసినట్టు జనసేన నేతలు ఆఫ్ ది రికార్డుగా చెప్పడం విశేషం.