జనసేన నాయకుడు నాగబాబు జనసేన క్యాడర్ కి పిలుపు ఇచ్చారు. ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేయాలని ఆయన కోరడం విశేషం. ఏపీలో ప్రస్తుతం వైసీపీకి 151 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సున్నా సీట్లు ఎలా వస్తాయో నాగబాబే చెప్పాలని అంటున్నారు. పైగా వైసీపీ వై నాట్ 175 అని అంటోంది.
ఇది అత్యాశ కాదా అని జనసేన నేతలు అనవచ్చు. కానీ 151 సీట్లు ఉన్న పార్టీ మరో 24 సీట్లకు ఎగబాకాలని కోరుకోవడం వేరు. ఒక్క సీటు గత ఎన్నికల్లో వచ్చిన జనసేన 23 వచ్చిన టీడీపీ పొత్తులు పెట్టుకుని మొత్తం ఆ 151 సీట్లకు కూడా లాగేసుకుంటామని చెప్పడం వేరు అంటున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూడా ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే ఈ రోజుకీ బయటపడలేదు. ఏ సర్వే కూడా వైసీపీ చిత్తుగా ఓడుతుందని కానీ విపక్ష కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని కానీ చెప్పలేదు. వైసీపీకి ఎక్కువ సీట్లు ఇస్తున్న సర్వేలు ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమికి విజయాన్ని కట్టబెడుతున్న సర్వేలు కొన్ని ఉన్నాయి.
నిష్పాక్షికంగా సర్వేలు చేశామని చెబుతున్న వారు అయితే హోరా హోరీ పోటీ అంటున్నారు. ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చినా బొటా బొటీ మెజారిటీ అన్న మాట కూడా వినిపిస్తున్నారు. కానీ నాగబాబు మాత్రం వైసీపీకి ఒక్క సీటూ రాకూడదు అంటున్నారు. ఇది అత్యాశ అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
వైసీపీ అంత బలహీనంగా ఉంటే పొత్తులు లేకుండా జనసేన పోటీ చేయవచ్చు కదా అన్న ప్రశ్ననూ సంధిస్తున్నారు. పొత్తులు ఎత్తులు బీజేపీ కోసం రాయబారాలు ఇన్ని చేస్తూ కూడా ఇంకా గెలుపు ధీమా విపక్ష కూటమికి చిక్కలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చమని చెబుతూ అనుకూల ఓటు చీల్చడానికి కాంగ్రెస్ ని ఎగదోస్తూ విపక్షం ఏపీలో పన్నుతున్న రాజకీయాన్ని చూసిన జనాలు అయితే వైసీపీ బలంగా ఉందనే నమ్ముతున్నారు.
అయితే ఎన్నికల్లో ఎన్నో లెక్కలు ఉంటాయి వచ్చిన జనాలు ఓట్లు వేయరు. వేసిన జనాలు వెంట రారు. అంతా ఒక రకమైన అద్భుతంగా ఉంటుంది. రాజకీయం అంటేనే అలా ఉంటుంది. అయితే రాజకీయాలలో జనాలే కొలమానం అనుకున్నపుడు ఆదరణ బాగా ఉందని అనుకున్నపుడు కూడా కొన్ని సార్లు ఆశ బదులు అత్యాశ పుడుతుంది. నాగబాబు కామెంట్స్ మీద కూడా అదే అంటున్నారు. ఏది ఏమైనా గెలవాలన్న కసిలో తప్పు లేదు. కానీ అది కూడా లాజిక్ కి అందేలా ఉండాలని అంటున్నారు.