గంటా చుట్టానికి గాజువాక?

విశాఖ జిల్లా గాజువాక సీటు ఇప్పుడు హాట్ ఫేవరేట్ గా మారింది. ఈ సీటు కోసం అధికార వైసీపీతో పాటు విపక్ష కూటమిలోనూ పోటీ చాలా ఎక్కువగా ఉంది. గాజువాక వైసీపీ సీటు కార్పోరేటర్…

విశాఖ జిల్లా గాజువాక సీటు ఇప్పుడు హాట్ ఫేవరేట్ గా మారింది. ఈ సీటు కోసం అధికార వైసీపీతో పాటు విపక్ష కూటమిలోనూ పోటీ చాలా ఎక్కువగా ఉంది. గాజువాక వైసీపీ సీటు కార్పోరేటర్ గా ఉన్న ఉరుకూటి రామచంద్రరావుకు కేటాయించింది.

టీడీపీ జనసేన విషయంలో ఈ సీటు మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ సీటుని తమకే వదిలేయాలని జనసేన కోరుతోంది. 2019లో ఇదే సీటు నుంచి పవన్ పోటీ చేశారు. దాంతో గాజువాక తమది అన్న అభిప్రాయంతో జనసేన ఉంది.

జనసేన నుంచి ఈ సీటు కోసం సీనియర్ నేతలు పలువురు చూస్తున్నారు. కులాల వారీగా కూడా తమకే సీటు అని కూడా ధీమాగా ఉన్నారు. టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఇదే సీటు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

అయితే అనూహ్యంగా గాజువాక జనసేన సీటు విషయంలో ఒక పేరు చక్కర్లు కొడుతోంది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు బంధువు అయిన పరుచూరి భాస్కరరావుని గాజువాక నుంచి జనసేన తరఫున పోటీ చేయిస్తారు అని అంటున్నారు.

పరుచూరి భాస్కరరావు అనకాపల్లి సీటు ఆశిస్తున్నారు. ఆయన 2019లో జనసేన తరఫున పోటీ చేసి పన్నెండు వేల ఓట్లకు పైగా సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన నమ్ముతున్నారు.

అంగబలం అర్ధబలం గట్టిగా ఉన్న పరుచూరి భాస్కరరావుకు జనసేన ప్రాధాన్యత ఇస్తోంది అని అంటున్నారు. ఆయన కోరుకున్న అనకాపల్లి సీటు దక్కకపోయినా గాజువాక నుంచి ఆయన్ని అకామిడేట్ చేస్తారని తద్వారా ఆయన బలాలను పార్టీకి జిల్లాలో వాడుకుంటారు అని ప్రచారం అయితే సాగుతోంది.

రెండు లక్షల ఓటర్లు ఉన్న గాజువాకలో జనసేన, టీడీపీ పొత్తు ఉంటే గెలుపు ఖాయమని అంటున్నారు. అన్ని రకాలుగా ఢీ కొట్టే లీడర్ గా ఉన్న భాస్కరరావుని తెస్తే విజయానికి బాటలు వేసినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారుట. ఎలా చూసుకున్నా భాస్కరరావుకు టికెట్ అయితే ఖరారు అవుతుంది అని ప్రచారం సాగుతోంది.