ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో వాళ్లిద్దరూ బహిరంగ సభల్లో మాట్లాడే అంశాలను పరిశీలిస్తే, ఎవరేంటి? అని అర్థం చేసుకోవచ్చు. బహిరంగ సభల్లో చంద్రబాబు తన విలువైన సమయాన్ని కేవలం జగన్‌ను తిట్టడానికే దుర్వినియోగం చేస్తున్నారు. ఉమ్మడి, విభజన ఆంధ్రప్రదేశ్‌కు 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేశారో చెప్పి, ఆ తర్వాత ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌పై ఎన్నైనా విమర్శలు చేసి ఉంటే బాగుండేది.
కానీ చంద్రబాబునాయుడు ఆ పని చేయడం లేదు. మాట్లాడినంత సేపు జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కనీసం సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన ప్రచారం చేసుకోవడం లేదు. జగన్ సైకో అంటూ ఊగిపోతున్నారు. తన పరిపాలన కాలాన్ని గుర్తుకు తెచ్చి. ఓట్లు అడిగితే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకనో చంద్రబాబు తన పరిపాలనా కాలాన్ని గుర్తు చేయడానికి భయపడుతున్నట్టున్నారు.
ఇదే జగన్ విషయానికి వస్తే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మంచి పనులేంటో వివరిస్తున్నారు. జనాన్ని జగన్ అప్పీల్ చేస్తున్నది కూడా అదే. తన పరిపాలనలో ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని చెబుతూనే, అది నిజమైతేనే ఓట్లు వేయాలని కోరుతున్నారు. మంచి జరగకపోతే ఓట్లు వేయొద్దని విజ్ఞప్తి చేయడానికి ఎంతో ధైర్యం వుండాలి. తన పాలనలో మంచి జరిగిందని జగన్ నమ్మడం వల్లే ధైర్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏమీ జరగలేదని కదా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నది. అదే నిజమని నమ్మితే…గతంలో తమ మ్యానిఫెస్టో, ఆ తర్వాత వైసీపీ మ్యానిఫెస్టోను తెరపైకి తీసుకొచ్చి, అమలుపై బహిరంగంగా చర్చ పెడితే సరిపోతుంది. అప్పుడు ఎవరు ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకులో ప్రజలే తేల్చుకుంటారు. తమ మ్యానిఫెస్టో అమలుపై చంద్రబాబుకు చర్చ పెట్టే దమ్ము, ధైర్యం ఉన్నాయా?
సుమారు 650 హామీలను 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ బుట్టదాఖలే. రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఏ మేరకైందో అందరికీ తెలుసు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారును చంద్రబాబు ఇంటికి తీసుకొచ్చారా? లేదా? అనేది రైతాంగానికి బాగా తెలుసు.
బాబు వస్తే, జాబు వస్తుందని ఊదరగొట్టి …చివరికి లోకేశ్‌కు మంత్రి పదవితో అందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టు సంతృప్తి చెందాలని చెప్పకనే చెప్పారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు? ఎంత మొత్తం ఇచ్చారో టీడీపీ నేతలను అడిగితే బాగా చెబుతారు. బాబు పాలనలో చివరి ఆరు నెలల్లో అన్నా క్యాంటీన్లు పెట్టి హడావుడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు పాలన అంతా చివరి ఐదారు నెలలు మాత్రమే అని టీడీపీ నేతలే విమర్శించారు. అందుకే తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.
కానీ జగన్ పాలన అలా లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మ్యానిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం లాంటి హామీలను నెరవేర్చలేదు. అయితే మెజార్టీ పరంగా చూస్తే 90 శాతం హామీలను నెరవేర్చామని వైసీపీ చెబుతోంది. కాదని ఎవరైనా విమర్శిస్తే, లెక్కలేసి చెబితే వైసీపీ పట్టుబడుతుంది. ఆ పని ప్రతిపక్షాల వైపు నుంచి జరగడం లేదు.
కేవలం వైఎస్సార్ కుటుంబ సభ్యుల గొడవను తెరపైకి తీసుకొచ్చి, విమర్శలు చేస్తూ పోతే రాజకీయంగా ఎలా ప్రయోజనమో టీడీపీ ఆలోచించుకోవాలి. కీలకమైన ఎన్నికల తరుణంలో టీడీపీకి ప్రచార అస్త్రాలు కరువైనట్టు, జగన్‌పై దాడికి పరిమితమైంది. అదే జగన్‌కు కలిసొస్తోంది. తాను చేసిన మంచి గురించి ప్రజలకు వివరిస్తూ, ఓట్లను అభ్యర్థించడం వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తోంది.