తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తన రాజకీయ ప్రజ్ఞాపాటవాల మీద నమ్మకం చాలా ఎక్కువ! తాను అసమాన రాజకీయ దురంధరుడిని అని ఆయనకు ఒక బలమైన నమ్మకం. అందుకే ఆయన రాజకీయాల్లో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా.. తెలంగాణకు తొలిముఖ్యమంత్రి కాగలిగారు.
తాను తెలంగాణ జాతిపితను అని పిలిపించుకోగలిగారు. ఆయన వ్యూహాల మీద అపారమైన నమ్మకం ఉన్నది గనుకనే.. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని నట్టేట కలిపేసి.. దాని పేరు భారత రాష్ట్రసమితిగా మార్చారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశం మొత్తానికి రుచిచూపిస్తానని, మోడీని ఓడించి.. ఢిల్లీ గద్దెపై కూర్చుంటానని ప్రతిజ్ఞ చేశారు.
అయితే ఆ రకమైన కేసీఆర్ విజన్ ను ఆయన కుమారుడు, వారసుడు కేటీఆర్ తప్పుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే.. అది కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే సాధ్యం అంటూ కల్వకుంట్ల తారక రామారావు నొక్కి వక్కాణిస్తున్నారు.
తాము ప్రాంతీయ పార్టీల కోటాలోకి ఇక ఎంతమాత్రమూ రాబోమని, తమ గులాబీదళం కూడా ఒక అతి చిన్న, అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికే ఇంకా సతమతం అవుతున్న జాతీయ పార్టీ అనే సంగతి కేటీఆర్ మరచిపోయి ఉంటారని అనుకోలేం. తమది కూడా జాతీయ పార్టీ అని తెలిసి కూడా.. భాజపాను అడ్డుకోవడం కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రం సాధ్యం అని కేటీఆర్ అంటున్నారంటే.. భారాసకు కూడా అది చేతకాదని ఒప్పుకోవడమే అవుతుంది.
తండ్రి కేసీఆర్ విజన్ ను.. జాతీయ పార్టీగా వెలుగొందాలనే తపనను, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుగన్న ఆరాటాన్ని కేటీఆర్ తప్పపడుతున్నట్లుగానే ఈ వ్యవహారం ఉంది. తెలంగాణలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రిగా కొడుకుకు పట్టాభిషేకం చేసేసి.. తాను హస్తినాపురంలో కూర్చుని రాజకీయం చేయాలని అనుకున్న కేసీఆర్, అందుకోసం జాతీయ పార్టీగా అవతరించారు. కానీ సొంత రాష్ట్రంలో ప్రజలు దారుణంగా తిప్పికొట్టారు.
ఇప్పుడిప్పుడే సొంత పార్టీలో కేసీఆర్ నిర్ణయం పట్ల ధిక్కార స్వారలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరులోంచి తీసేయడం వల్ల మాత్రమే ఓడిపోయినట్లుగా పలువురు మాట్లాడుతున్నారు. పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మారిస్తే తప్ప మనుగడ ఉండదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కేసీఆర్ విజన్ ను వీరందరూ కూడా వ్యతిరేకిస్తున్నారన్నమాట. మరి గులాబీ దళంలో ఈ అంతర్గత రాజకీయాలు.. వారి పార్టీ అస్తిత్వాన్ని ఎలా మార్పుచేస్తాయో చూడాలి.