జేసీ పవన్ కుమార్ రెడ్డి రాజకీయ పరిస్థితి ఏమిటో వారి వీరాభిమానులకు కూడా అంతుబట్టడం లేదు! గత ఎన్నికల్లో జేసీ పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అయితే నెగ్గలేకపోయారు! ఆ తర్వాత సోషల్ మీడియాలో జేసీ పవన్ ను అనంతపురం లోక్ సభ ఇన్ చార్జి అని రాసుకుంటున్నారు ఆయన అభిమానులు. అయితే.. చాన్నాళ్ల కిందటే అనంతపురం లోక్ సభ సీటుకు కాలువ శ్రీనివాసులను టీడీపీ ఇన్ చార్జిగా ప్రకటించింది. ఇప్పుడు అభ్యర్థి కూడా ఆయనే అంటూ టీడీపీ అనుకూల మీడియానే లీకులు ఇస్తోంది.
ఇక తాడిపత్రి అసెంబ్లీ సీటు విషయానికి వస్తే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి తన తనయుడిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు! ఇప్పటి వరకూ చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన చేయలేదు! దీంతో ఎలాగైనా కొడుకును బరిలోకి దించడానికి ఆయన ఆరాటం కొనసాగుతూ ఉంది! మరి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తే.. అప్పుడు పవన్ పరిస్థితి ప్రశ్నార్థకం!
వచ్చే ఎన్నికల్లో పవన్ కు టీడీపీ తరఫున ఎక్కడా టికెట్ దొరకడం లేదని ఇలా స్పష్టం అవుతోంది. జేసీ ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి మించి మరో టికెట్ ఇవ్వరనే ప్రచారం చాన్నాళ్ల నుంచినే ఉంది! మరి అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి తనయుడి రాజకీయానికి ఆస్కారం లేకుండా పోతుంది. ప్రభాకర్ రెడ్డి తనయుడు తాడిపత్రిలో బరిలో దిగినట్టుగా అయినా అనిపించుకోగలుగుతారు!
ఆ సంగతలా ఉంటే.. మరి కొడుకు రాజకీయ భవితవ్యం గురించి జేసీ దివాకర్ రెడ్డి ఏం చేస్తున్నారో కానీ, ఆయన ఇప్పుడు వరసకు అల్లుడయ్యే దీపక్ రెడ్డి కోసం లాబీయింగ్ చేస్తున్నారట! దీపక్ రెడ్డిని రాయదుర్గం నుంచి పోటీ చేయించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారట, లోకేష్ పాదయాత్ర కోసం దీపక్ రెడ్డి బాగానే ఖర్చు చేశాడంటారు!
అయినా ఇప్పుడు అందుకు ప్రతిఫలంగా దీపక్ రెడ్డికి రాయదుర్గం టికెట్ ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది! దీంతో దీపక్ రెడ్డిని పోటీ చేయించడానికి జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు వద్ద ప్రయత్నాలు మొదలుపెట్టారట! మరి తనయుడి సంగతెలా ఉన్నా.. కనీసం మేనల్లుడిని బరిలోకి దింపడానికి జేసీ దివాకర్ రెడ్డి వృద్ధాప్యంలో కష్టపడుతున్నట్టుగా ఉన్నారు. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో!