అభ్యర్థుల ఎంపికలో అధికార పార్టీ వైసీపీ చర్యలు సొంత పార్టీ నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదు. సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను భారీగా మారుస్తున్నా పెద్దగా వ్యతిరేకత రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ వ్యతిరేక కూటమి టీడీపీ-జనసేనలో మరింత గందరగోళం ఉండడమే.
ముందుగా అధికార పార్టీ విషయానికి వద్దాం. సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్టు సీఎం వైఎస్ జగన్ పలుమార్లు వెల్లడించారు. ఇందులో కొంత మాత్రమే నిజం వుంది. అదే నిజమైతే వద్దని మరో నియోజకవర్గానికి మార్చిన అభ్యర్థుల్లో కొందరికి మళ్లీ సిటింగ్ స్థానాన్నే కేటాయించడం దేనికి సంకేతం? వారంలోపే కొన్ని చోట్ల అభ్యర్థులను మళ్లీమళ్లీ మార్చాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడీనెల్లూరు, సత్యవేడు అసెంబ్లీ, అలాగే చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లోనూ, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎమ్మిగనూరులో సిటింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని వద్దనుకుని, చేనేత సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్‌ను సమన్వయకర్తగా నియమించారు. ఏమైందో తెలియదు కానీ, మళ్లీ ఆయన్ను తప్పించి మాజీ ఎంపీ బుట్టా రేణుకను తాజాగా నియమించడం ఆ పార్టీలో గందరగోళానికి నిదర్శనం. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురానికి, అక్కడి ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేయడం విశేషం.
సర్వే నివేదికల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలను మరో నియోజకవర్గానికి పంపడం వల్ల వచ్చే లాభం ఏంటో వైసీపీ అధిష్టానానికి తెలియాలి. అధికార పార్టీలో ఇంత గందరగోళం జరుగుతున్నా ప్రతిపక్షాల కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకునే పరిస్థితి లేదు. ఇదే వైసీపీకి కొండంత లాభం.
నిజంగా టీడీపీ-జనసేన ఒక ప్రణాళికతో ముందుకెళ్లి వుంటే, ఈ పాటికి వైసీపీ డీలా పడిపోయి, ఎన్నికలకు ముందే చేతులెత్తేసి వుండేది. కానీ టీడీపీ-జనసేన కూటమిలో వైసీపీలో కంటే ఎక్కువ అయోమయం నెలకుంది. పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఎక్కడెక్కడ అనే విషయాల్ని తేల్చుకోడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ రోజులను కరిగిస్తున్నారు. సరైన ఔట్ ఫుట్ మాత్రం రావడం లేదు.
అభ్యర్థుల ఎంపికలో కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అనే రీతిలో ఇరుపార్టీల అభ్యర్థుల ఎంపిక వ్యవహారం సాగుతోంది. ఇలా జాప్యం చేయడం వల్ల టీడీపీ-జనసేన కూటమి రానున్న రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. తాము ఆశించిన మేరకు సీట్లు, నియోజకవర్గాలు దక్కకపోతే చంద్రబాబు మోసం చేశారని జనసేన శ్రేణులు, అలాగే పవన్‌కల్యాన్ వల్ల తాము నష్టపోవాల్సి వచ్చిందని టీడీపీ నేతలు పరస్పరం కత్తులు దూసుకునేందుకు ఎంతో దూరం లేదు.
అభ్యర్థుల ఎంపికకు వ్యూహం అని టీడీపీ-జనసేన కూటమి ముద్దు పేరు పెట్టుకోవచ్చు. ఆ వ్యూహం బెడిసి కొట్టి, చివరికి వైసీపీకి రాజకీయంగా లాభం కలిగిస్తుందనే ఆందోళన ఆ రెండు పార్టీల నేతల్లో వుంది. వైసీపీ భారీగా ప్రక్షాళన చేపట్టినా, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఆనందమే తప్ప, వ్యతిరేకత లేకపోవడం గమనార్హం. ఇదే టీడీపీ-జనసేన కూటమి విషయానికి వస్తే… నివురు గప్పిన నిప్పులా వ్యతిరేకత వుంది.
జనసేనకు 20 లేదా 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే, ఆ పార్టీ నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ కూడా 20 లేదా 25 శాతమే జరుగుతుందని పవన్ పార్టీ నాయకులు నర్మగర్భ హెచ్చరికలు చేస్తున్నారు. సీట్లు, నియోజకవర్గాలపై వారంలోపు స్పష్టత రాకపోతే మాత్రం మరోసారి వైసీపీకి అధికారం కట్టబెట్టడానికి చంద్రబాబు, పవన్ అసమర్థతే కారణమవుతుందనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాన్చివేత ధోరణి, పవన్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ వెరసి, వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. అందుకే ఇంత గందరగోళంలోనూ ఏపీలో మరోసారి జగన్‌దే అధికారం అని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.