ఏపీ సర్కారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా సిలబస్ అమలు చేసేలా నూతన విధానాన్ని తీసుకువస్తూ అందుకు విద్యారంగాన్ని సంసిద్ధం చేసేలా.. 6100 టీచరు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపి రంగం సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ఏ మంచి పని చేయాలని అనుకున్నా సరే.. సైంధవ పాత్రలోకి ప్రవేశించి దానికి అడ్డుపడే తెలుగుదేశం పార్టీ.. ఈ టీచరు ఉద్యోగ నియామకాలను కూడా జీర్ణించుకోలేకపోతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకటనను చినబాబు నారా లోకేష్ తప్పుపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదని ఆయన శకునాలు పలుకుతున్నారు. ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తర్వాత.. డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ రావడం అనేది కేవలం లాంఛనం. ప్రక్రియ అధికారికంగా మొదలైపోయిన తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా సరే దానిని ఆపవలసిన అవసరం ఉండదు. యథావిధిగా అది జరిగిపోతుంది. అయితే చినబాబు మాటలు చూస్తోంటే.. ఎన్నికల కోడ్, పేరుపెట్టి దీనిని కూడా అడ్డుకోవడానికి పచ్చదళాలు వ్యూహరచన చేస్తున్నాయేమోననే అనుమానం కలుగుతోంది.
పేదలకు ఇంటిస్థలాలు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి ఏ ప్రజ ప్రయోజనాల కార్యక్రమాలను నిర్వహించడానికి జగన్ సర్కారు పూనుకున్నా సరే.. పచ్చ దళాలు న్యాయపరమైన చిక్కులను సృష్టించి వాటిని అడ్డుకుంటున్న తీరును ప్రజలు తొలినుంచి గమనిస్తూనే ఉన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో లీగల్ చిక్కుల వల్ల పని జరగడం లేదు.
అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంటే తెలుగుదేశం కుట్రదారులే కోర్టు ద్వారా బ్రేకులు వేయించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడానికి కొన్ని కార్యాలయాలకు క్యాంపు ఆఫీసులను విశాఖలో ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తే దానికి కూడా అడ్డు పడ్డారు. ప్రభుత్వం చేయదలచుకున్న పనులకు అడ్డు పడడమే అలవాటుగా కలిగిన పచ్చదళాలు డీఎస్సీ మీద కన్నేసినట్టుగా కనిపిస్తోంది.
కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50 వేల టీచరు ఖాళీలున్నాయని లోకేష్ అంటున్నారు. అధికారంలోకి రాక ముందు 23వేల టీచరు పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహిస్తానని జగన్ అన్నారని, గెలిచిన తర్వాత ఖాళీలు 18వేలే అని చెప్పారని, మంత్రి బొత్స అసెంబ్లీలో 8366 ఖాళీలను నింపుతామని అన్నప్పటికీ.. 6100కు నోటిఫికేషన్ తెస్తున్నారని లోకేష్ అంటున్నారు. ఆయన వద్ద నిజంగా సరైన గణాంకాలు ఉంటే ఇలాంటి విమర్శ ఓకే. కానీ.. డీఎస్సీ అసలు జరగదని అనడం మాత్రం కుట్రలో భాగమే. పైగా, తాము గెలవగానే ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం అంటున్న లోకేష్.. ‘ఎన్ని’ అనేది మాత్రం అంచనాగా కూడా చెప్పడం లేదు. అదే మరి చినబాబు తెలివి.