తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన 2018 నాటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకు ఊరట లభించింది. డ్రగ్స్ వాడారు, డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు వంటి అభియోగాలతో అప్పట్లో ప్రత్యేక సిట్ నమోదు చేసిన కేసులను న్యాయస్థానం కొట్టి వేసింది. సరైన సాక్ష్యాధారాలను సిట్ కోర్టు ముందు ప్రవేశ పెట్టకపోవడంతో ఆరు కేసులనూ న్యాయస్థానం కొట్టి వేసిందని తెలుస్తోంది.
హైదరబాద్ లో డ్రగ్స్ సప్లైయర్స్ పట్టుబడటం, వారికి సినిమా సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయనే లింకులు దొరికాయనే వార్తల నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారం ఆరేళ్ల కిందట సంచలనంగా మారింది. సప్లయర్లతో లింకుల అభియోగాలతో దర్శకుడు పూరి జగన్నాథ్, నటులు తరుణ్, రవితేజ, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్ తదితరులు సిట్ విచారణకు హాజరయ్యారు. వారిలో పూరి, తరుణ్ ల నుంచి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ను కూడా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే పూరీ, తరుణ్ లు డ్రగ్స్ వాడినట్టుగా ఆధారాలు లేవని ల్యాబ్ రిపోర్టులు కోర్టుకు నివేదించాయి. వారి శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాలు లేవనే ల్యాబ్ రిపోర్ట్ తో వారికి ఊరట లభించింది. ఇక సినిమా సెలబ్రిటీలపై అప్పట్లో సిట్ నమోదు చేసిన ఇతర అభియోగాలకూ సరైన ఆధారాలు లేకపోవడంతో.. వారిపై నమోదైన కేసులను కొట్టి వేస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం విపరీత స్థాయికి చేరిందంటూ ప్రస్తుతం కూడా మీడియాలో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అలాంటి వార్తలు వచ్చినప్పుడు సినిమా సెలబ్రిటీల కేసులు చర్చలోకి వచ్చేవి ఇన్నాళ్లు. అయితే.. వారిపై ప్రత్యేక ధర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులన్నింటినీ న్యాయస్థానం కొట్టి వేయడంతో సదరు సెలబ్రిటీలకు పెద్ద ఊరట లభించినట్టే!