ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంలో మిత్ర‌ప‌క్షం ఎన్నిక‌ల శంఖారావం!

జ‌న‌సేన, బీజేపీ పొత్తులో ఉన్నాయ‌ని ఇరు పార్టీల నేత‌లు త‌ర‌చూ చెబుతుంటారు. మ‌రీ ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ప‌దేప‌దే జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న విష‌యాన్ని గుర్తు చేస్తుంటారు. అయితే ప‌వ‌న్…

జ‌న‌సేన, బీజేపీ పొత్తులో ఉన్నాయ‌ని ఇరు పార్టీల నేత‌లు త‌ర‌చూ చెబుతుంటారు. మ‌రీ ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ప‌దేప‌దే జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న విష‌యాన్ని గుర్తు చేస్తుంటారు. అయితే ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారంలో ఉన్న భీమ‌వ‌రంలో పురందేశ్వ‌రి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పొత్తులో ఉన్నామంటూ ఒక‌వైపు పురందేశ్వ‌రి చెబుతూనే, మ‌రోవైపు జ‌న‌సేన‌తో సంబంధం లేకుండానే ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌డం గ‌మ‌నార్హం.

ప‌శ్చిమ‌గోదావరి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పురందేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒకేసారి 25 పార్ల‌మెంట్ బీజేపీ కార్యాల‌యాలు ప్రారంభించుకోవ‌డం సువ‌ర్ణ అధ్యాయంగా ఆమె అభివ‌ర్ణించారు. 2024 ఎన్నిక‌ల నగారా మోగించామ‌న్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను గౌర‌వించుకునే పార్టీ త‌మ‌ద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ 350 స్థానాలు గెలుచుకుంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు.

ప్ర‌త్యేక హోదా కంటే ప్యాకేజీ కావాల‌ని చంద్ర‌బాబునాయుడు అడిగార‌ని ఆమె గుర్తు చేశారు. త‌ప్పుల‌న్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం, నాయ‌కులు చేసి బీజేపీని త‌ప్పు ప‌ట్ట‌డం స‌రైంది కాద‌ని ఆమె అన్నారు.

ఇదిలా వుండ‌గా భీమ‌వ‌రంలో పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు, లోకేశ్ దృష్టికి ప‌వ‌న్ తీసుకెళ్లారు. ఇందుకు వాళ్లిద్ద‌రూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. అయితే మిత్ర‌ప‌క్ష‌మ‌ని ఒక‌వైపు చెబుతూనే, ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యేకంగా ఎన్నిక‌ల న‌గారాను పురందేశ్వ‌రి మోగించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మాట‌కు, చేత‌ల‌కు పొంత‌న లేకుండా బీజేపీ, జ‌న‌సేన న‌డుచుకుంటున్నాయ‌నే విమ‌ర్శ‌కు తాజా కార్య‌క్ర‌మం నిద‌ర్శ‌నంగా నిలిచింది.