2024 ఎన్నికలకు గానూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను విడుదల చేసింది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు గానూ మొత్తం ఏడు స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదో జాబితాలో అభ్యర్థుల ప్రకటన చేసింది. ఇందులో ఇది వరకటి జాబితాలోని సీట్లకు మార్పులు కూడా ఉండటం గమనార్హం.
ప్రధానంగా తిరుపతి ఎంపీ సీటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. సత్యవేడు ఎమ్మెల్యేను తిరుపతి ఎంపీ సీటుకు ఇన్ చార్జిగా ప్రకటించడంతో, ఆయన అలకబూనడం సంగతి తెలిసిందే. గురుమూర్తిని అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా ఇన్ చార్జిగా ప్రకటించారు. అయితే మార్పును చేస్తూ తిరిగి ఆయనను తిరుపతి ఎంపీ సీటుకే అభ్యర్థిగా ప్రకటించారు.
ఇక ఐదో జాబితాలో మరో కీలకమైన అంశం.. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించడం. నర్సరావుపు పేట సీటును బీసీలకు కేటాయించాలనే నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబును ప్రకటించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ ను మరోసారి అభ్యర్థిగా ప్రకటించారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్ చార్జిగా నూకతోటి రాజేష్ ను ప్రకటించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను ప్రకటించారు.