ఉత్తరాంధ్రా మీదనే వైసీపీ అధినాయకత్వం కోటి ఆశలు పెట్టుకుంది. అందుకే సిద్ధం పేరుతో తొలి సభను విశాఖ జిల్లాలో నిర్వహించింది. ఈ సభను కనీ వినీ ఎరుగని తీరులో నిర్వహించి సక్సెస్ చేయడంతో వైసీపీ శ్రేణులు పూర్తిగా శ్రమించాయి అని చెప్పక తప్పదు. ఈ సభ జన సునామీనే తలపించింది. దాంతో ఈ సభను చూసిన విపక్షాలు ఎంత మంది జనాలు వచ్చి ఉంటారు అన్న లెక్కలలో మునిగితేలుతున్నారు.
వైసీపీ వర్గాలు అయితే మూడు లక్షలకు పై దాటి అని అంటున్నారు. మొత్తం ముప్పయి నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఒక్కో అసెంబీ సెగ్మెంట్ నుంచి పది వేలకు పైగా కార్యకర్తలు వచ్చారని వారు వివరిస్తున్నారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఈ జన సముద్రాన్ని తట్టుకోవడానికి ఈ సభా స్థలి సరిపోవడంలేదు. దీనికి పదింతలు కావాలని చెప్పుకొచ్చారు.
వైసీపీ మంత్రులు అంతా కార్యకర్తలలో కొత్త ఉత్సాహం చూశామని చెబుతున్నారు. జగన్ కూడా తన స్పీచ్ ని మార్చి క్యాడర్ కి ఇవ్వాల్సిన హుషార్ ని ఇచ్చారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ప్రతీ కార్యకర్త ఏమి చెప్పాలి, వైసీపీని మళ్లీ ఎలా గెలిపించాలన్నది జగన్ దిశా నిర్దేశం చేశారు.
దీంతో ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న క్యాడర్ లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ స్పీడ్ తో 2019 మాదిరిగానే పనిచేస్తే ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని అంటున్నారు. ప్రజలు ఎటూ వైసీపీ వైపు ఉన్నారని వారితో మమేకం కావడమే క్యాడర్ పని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో రూరల్ బెల్ట్ అంతా వైసీపీకి గట్టి సపోర్ట్ గా ఉంటోందని చెబుతున్నారు. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. తొందరలోనే అభ్యర్ధులు ఎవరో కూడా బయటకు వస్తే రానున్న రెండు నెలలు క్యాడర్ లీడర్ అంతా కలసి పటిష్టంగా ప్రచారం చేసుకుంటే గతసారి వచ్చిన 28 సీట్లకు మించి ఒకటైనా అదనంగా రావాల్సిందే తప్ప తగ్గదని అంటున్నారు. ఈ విషయంలో కావాల్సినంత ధీమాను అయితే జగన్ సభ ఇచ్చింది అని అంటున్నారు.
అయితే జగన్ సభ సక్సెస్ ని టీడీపీ జనసేన మాత్రం అంగీకరించడం లేదు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అయితే మూడు లక్షల మంది రాలేదు మూడు వేల మంది జనాలు వచ్చారని అంటున్నారు. ఇది నిజంగా బాగా తగ్గించి చూపే ప్రయత్నమే అన్నది వైసీపీ నేతల మండిపాటుగా ఉంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే వైసీపీ నకిలీ పార్టీ అని ఆ పార్టీకి ఓటమి ఖాయమని తన జోస్యాన్ని చదివి వినిపించారు.
నిన్నటి వైసీపీ ఎమ్మెల్యే నేటి జనసేన విశాఖ ప్రెసిడెంట్ అయిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ సిద్ధం సభలో కొత్తదనం లేదని, జగన్ పాత హామీలనే కొత్తగా చదివారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే విపక్ష శిబిరంలో జగన్ సభ ప్రకంపనలు పుట్టించింది అనే అంటున్నారు.