కనీసం చిరంజీవి కోసమైనా ఇండస్ట్రీ కలుస్తుందా..?

టాలీవుడ్ ముక్కచెక్కలై చాలా కాలమైంది. ఎవరి వ్యాపారం వాళ్లది, ఎవరి స్వార్థం వాళ్లది. ఒకప్పుడు ఏదైనా మంచి జరిగితే విబేధాలు పక్కనపెట్టి కలుసుకునేవారు, సెలబ్రేట్ చేసుకునేవారు. లోలోపల కత్తులు దువ్వినా, పైకి మాత్రం తామంతా…

టాలీవుడ్ ముక్కచెక్కలై చాలా కాలమైంది. ఎవరి వ్యాపారం వాళ్లది, ఎవరి స్వార్థం వాళ్లది. ఒకప్పుడు ఏదైనా మంచి జరిగితే విబేధాలు పక్కనపెట్టి కలుసుకునేవారు, సెలబ్రేట్ చేసుకునేవారు. లోలోపల కత్తులు దువ్వినా, పైకి మాత్రం తామంతా కలిసే ఉన్నామనే భావన కలిగించేవారు. కానీ ఇప్పుడా పద్ధతి కూడా పోయినట్టు కనిపిస్తోంది.

ఎవరికి వారే అన్నట్టుంది టాలీవుడ్. ఎవరి గ్రూపులు వాళ్లవి, ఎవరి మనుషులు వాళ్లకే. ఓ పెద్ద సందర్భం వచ్చినప్పుడు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఎవ్వరూ చేయడం లేదు. ఆ దిశగా చొరవ తీసుకునే వ్యక్తులు కూడా తగ్గిపోయారు.

మొన్నటికిమొన్న అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్ వస్తే టాలీవుడ్ స్పందన ఎలా ఉందో అందరం చూశాం. సెలబ్రేట్ చేయాల్సిన సందర్భాన్ని ప్రెస్ నోట్లకు పరిమితం చేశారు చాలామంది. అంతకంటే ముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్తే, పండగ చేసుకోవాల్సింది పోయి, టాలీవుడ్ లో ఓ రకమైన నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. మెజారిటీ వ్యక్తులు, సంస్థలు ట్వీట్లు వేసి మమ అనిపించారు. ఆ తర్వాత ఓ ఫంక్షన్ పెట్టినా టాలీవుడ్ కు సంబంధం లేదనట్టు జరిగిందది.

సినిమాలు పెద్ద సక్సెస్ సాధించినప్పుడు ఫంక్షన్లు చేసుకోవడం చేసుకోకపోవడం వాళ్ల ఇష్టం. కలిసిరావాల్సిన వాళ్లు వచ్చినా, రాకున్నా అది వాళ్ల వ్యక్తిగతం. కానీ జాతీయ అవార్డు, ఆస్కార్ అవార్డు లాంటి ఘనతల్ని కూడా పట్టించుకోకపోతే ఎలా?

ఇప్పుడు చిరంజీవికి పద్మవిభూషణ్ కూడా అలాంటి అరుదైన సందర్భమే. కనీసం ఈసారైనా టాలీవుడ్ కలవాలి. అందరూ కలిసిరావాలి. హీరోలంతా ఒకే వేదికపైకి రావాలి. లెజండ్ ఎవరు సెలబ్రిటీ ఎవరు లాంటి వాదనలు పక్కనపెట్టాలి.. ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత, ఎవరి సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయనే లెక్కల్ని కాసేపు మరిచిపోవాలి.

చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయన సేవల్ని గుర్తించింది. టాలీవుడ్ కూడా చిరంజీవికి అలాంటి గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. చిరంజీవిని ఘనంగా సత్కరించడం ద్వారా, టాలీవుడ్ లో తామంతా ఒకటే అని అందరికీ చాటిచెప్పడానికి ఇదొక మంచి సందర్భం.