ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నారు.. పవన్!?

పవన్ కల్యాణ్ పరిస్థితి ఎలా ఉన్నదంటే.. ఆవురావురుమని ఉన్నారు. మామూలుగా ఇంగ్లీషులో ఒక మంచి నానుడి ఉంటుంది. మనిషిలో పాజిటివ్ ధోరణిని పెంచడానికి చెప్పుకునే మాట అది. Let the noble thoughts come…

పవన్ కల్యాణ్ పరిస్థితి ఎలా ఉన్నదంటే.. ఆవురావురుమని ఉన్నారు. మామూలుగా ఇంగ్లీషులో ఒక మంచి నానుడి ఉంటుంది. మనిషిలో పాజిటివ్ ధోరణిని పెంచడానికి చెప్పుకునే మాట అది. Let the noble thoughts come to us from all directions అని పెద్దలు అంటారు.

మంచి సలహా ఎవ్వరు చెప్పినా వినాలి అనేది ఆ నానుడి అంతరార్థం. మంచి ఆలోచనలు ఎవరు చెప్పినా వినాలి నిజమే. కానీ.. పవన్ కల్యాణ్ విషయంలో ఏ పార్టీ నుంచి ఎవ్వరు వచ్చినా తన పార్టీలో కలిపేసుకోవాలనే ఆరాటం కనిపిస్తోంది. పార్టీల నుంచి మాత్రమే కాదు.. విలువలు, నైతికత దేనితోనూ సంబంధం లేకుండా ఎవరు వచ్చి చేరుతాను అన్నా సరే.. పవన్ కల్యాణ్ రెడ్ కార్పెట్ పరచి పార్టీ కండువా కప్పేస్తున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

జనసేన పార్టీ సంస్థాగతంగా అత్యంత బలహీనమైన పార్టీ. పవన్ కల్యాణ్ కు సినిమా నటుడిగా ఉన్న క్రేజ్ వల్ల, కాపులు బలమైన సామాజిక వర్గం కావడం వల్ల ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉండవచ్చు గానీ.. సంస్థాగతంగా బలహీనం అనేది ఒప్పుకుని తీరాల్సిందే.

నాయకులు ఉండని పార్టీ అది. ఇప్పటికిప్పుడు పోటీ చేయడానికి సీట్లు పుచ్చుకుంటే ఔత్సాహికులు తప్ప గట్టి అభ్యర్థులు ఉండరు. చివరికి కమ్యూనిస్టుల పాటీ సంస్థాగత నిర్మాణం కూడా ఆ పార్టీకి ఉండదు. అలాంటి జనసేనలోకి ఎవరు వచ్చినా సరే.. చేర్చేసుకుని.. పార్టీ కాస్త బలంగా ఉన్నట్టుగా, బలపడుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ పాట్లు పడుతున్నట్టుగా కనిపిస్తోంది.

మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ వరుసలో ఇంకా అనేకమంది ఉన్నారని సమాచారం. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా పవన్ తో భేటీ అయ్యారు. ఆయనకు ఎటూ వైసీపీ టికెట్ నిరాకరించింది గనుక.. ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. అలాగే బుధవారం నాడు పార్టీలోకి సినీ కొరియోగ్రాఫర్ జానీ, నటుడు పృథ్వీరాజ్ వచ్చి చేరారు.

పృథ్వీరాజ్ వంటి విలువలు లేని అవకాశవాద నటుడిని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. జనసేనాని ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వదలచుకున్నారో అర్థం కావడం లేదు. పృథ్వీరాజ్ మొన్నమొన్నటి దాకా జగన్ ను కీర్తిస్తూ బతికారు.

ఎంతో గౌరవప్రదమైన ఎస్వీబీసీ చానెల్ సారథ్య బాధ్యతలను అప్పగిస్తే.. అత్యంత లేకిగా వ్యవహరించారు. అక్కడ మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారు. తక్షణం పదవినుంచే కాదు, పార్టీ నుంచి కూడా జగన్ వెలివేశారు. మహిళలకు తాము ఎంతో గౌరవం ఇస్తాం అని చెప్పుకునే జనసేనాని పవన్ కల్యాణ్.. ఇలాంటి నైతికత లేని, మహిళలతో ఆడుకునే వారిని తెచ్చి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే.. ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం పవన్ కల్యాణ్ అయినా ఆత్మసమీక్ష చేసుకోవాలి.