భగవంతుడికి తలనీలాలు అర్పించడం అంటే మనిషి తనలోని అహాన్ని చంపుకుని, భగవంతుడికి తనను తాను అర్పించడంతో సమానం. కానీ అదే మనిషికి బలవంతగా తలగొరగడం అంటే దారుణమైన పరాభవం. ఈ పరాభవం అనే పాయింట్ ను పరిగణనలోకి తీసుకుని బలవంతుడు బలహీనుడి కి శిరోముండనం చేసిన సంఘటనలు అక్కడక్కడ, అప్పుడప్పుడు జరుగుతూనే వుంటాయి. 2007 లో ఈస్ట్ గోదావరిలో జరిగిన అలాంటి సంఘటనను ఆలంబనగా చేసుకుని తయారు చేసిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.
యువ హీరో సుహాస్ తో కొత్త దర్శకుడు దుష్యంత్, నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఫిబ్రవరి తొలివారంలో విడుదల కు రెడీ అవుతున్న నేపథ్యంలో ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ రెండు భాగాలుగా ప్లాన్ చేసి కట్ చేసినట్లు కనిపిస్తోంది. బహుశా సినిమా కూడా తొలిసగం, మలిసగం ఇలా వుంటాయని ట్రయిలర్ ద్వారా సూచించారేమో?
ట్రయిలర్ తొలిసగం అల్లరి అల్లరిగా, ప్రేమాటల నడుమ సాగిపోయింది. మలి సగం అంతా భావోద్వేగాలు, పగ.. ప్రతీకారాల నడుమన నిలిచింది. కల్ట్ ఫిలిం కావాలనే కోరిక వుందో, అవుతుందనే ఆలోచన వుందో, అవ్వాలనే ప్రయత్నమో మొత్తానికి మలిసగం కాస్త ఘాటుగా.. సూటిగా వుంది.
సుహాస్ అన్ని విధాలో హీరో రోల్ కు ఫిట్ అనిపించాడు. మిగిలిన వారు కూడా ఒకె. పక్కా పల్లె వాతావరణం, సంభాషణలు, నేపథ్య సంగీతం అన్నీ కొలిచి వేసినట్లు వున్నాయి. ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా కథనం కనుక సాగిపోతే కలర్ ఫొటో, బేబి సినిమాల సరసన కూర్చుంటుందేమో ఈ గీతా బ్రాండ్ తో పుట్టిన ‘బ్యాండ్’ సినిమా.