ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అన్ని రాజకీయ పక్షాలు కత్తి కట్టాయి. ఆయనకు అందరూ ప్రత్యర్థులే. వైసీపీ ఒక్కటే ఒక వైపు ఉంటే మిగిలిన పక్షాలు అన్నీ మరో వైపు ఉన్నాయి. ఆఖరుకు 2019లో వైసీపీ పక్షాన ప్రచారం చేసిన చెల్లెలు షర్మిల కూడా కొత్త ప్రత్యర్థిగా మారారు. ఆమె కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా జగన్ మీద తీవ్ర విమర్శలే చేస్తున్నారు.
వామపక్షాలతో పాటు ఏపీ బీజేపీ కుడి ఎడమలు అన్నది లేకుండా జగన్ మీదనే విమర్శలు చేయడంతో పోటీ పడతాయి. టీడీపీ ప్రధాన ప్రత్యర్థి గా ఉంది, జనసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమి కట్టింది. ఇంతమంది నేతలు ప్రతీ రోజూ జగన్ మీద విమర్శలు చేస్తూ ఉంటే ఇపుడు వారితో మరో కీలక నేత జత కలవనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి వస్తున్నారు. ఆయన సీఎం అయిన తరువాత ఏపీలో తొలిసారి పెట్టబోయే సభకు విశాఖను ఎంచుకోవడం విశేషం. ఈ నెల 11న రేవంత్ రెడ్డి విశాఖలో కాంగ్రెస్ నిర్వహించే సభకు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ సభను జరుపుతోంది. తిరుపతిలో ప్రత్యేక హోదా హామీకి భంగం కలిగించారు అని సభను పెట్టిన కాంగ్రెస్ దానికి కేంద్రంలోని బీజేపీతో పాటు ఏపీలోని వైసీపీని తప్పుపట్టింది.
ఇపుడు విశాఖలో కూడా బీజేపీతో పాటు వైసీపీని కలిపి విమర్శించడం ద్వారా రెండిందాల లాభపడే వ్యూహంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో రేవంత్ రెడ్డి బీజేపీ మీద మోడీ ప్రభుత్వం మీద ఘాటైన ఆరోపణలు చేస్తారని అంటున్నారు. అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్ మీద ఆయన హాట్ కామెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏపీతో మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నారు. ఇంతలో ఎన్నికలు వచ్చి పడడంతో ఆయన సోదర రాష్ట్రం సీఎం ని కలవకుండానే రాజకీయ సమరానికి సిద్ధం కావాల్సి వస్తోంది. ఎన్నికల అనంతరం ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో బహుశా ఆయన భేటీ అవుతారేమో. జగన్ మీద అందరూ విమర్శలు చేశారు. మాటకారి అయిన రేవంత్ ఏ తరహా విమర్శలు చేస్తారో అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.