జనసేన అభ్యర్థుల ప్రకటనపై పవన్‌కల్యాణ్ తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో జనసేన ఆశావహుల్లో అసహనం పెరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబునాయుడు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఇచ్చారు. లోక్‌సభ అభ్యర్థులను పక్కన పెడితే, ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉత్కంఠ రేపుతోంది.
ఇప్పటికి ఐదుగురు అభ్యర్థుల్ని మాత్రమే పవన్‌కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలపై సస్పెన్స్ నెలకుంది. అలాగే టీడీపీకి సంబంధించి 94 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఇరుపార్టీలు కలిసి మొత్తం 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించినట్టైంది. ఇక 76 చోట్ల అభ్యర్థులెవరో తేల్చాల్సి వుంది. ఈ సీట్లు అత్యంత సమస్యాత్మకమైనవిగా చెబుతున్నారు.
వీటిలో జనసేనవి 19 సీట్లు. ఆ 19 నియోజక వర్గాలు ఏంటి? అనేది ఎవరికీ తెలియడం లేదు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో వెలువడనుంది. ఎన్నికలకు గట్టిగా 40 రోజులు మాత్రమే సమయం వుంది. ఇప్పటికీ అభ్యర్థులెవరో తేలకపోతే, ప్రజల దగ్గరికి వెళ్లేదెప్పుడనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఏఏ సీట్లు జనసేనకు ఇవ్వాలనే అంశంపై పవన్, చంద్రబాబు మధ్య అవగాహన వుందని చెబుతున్నారు. అలాంటప్పుడు అభ్యర్థుల ప్రకటనకు వచ్చిన సమస్య ఏంటని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అభ్యర్థులను ప్రకటిస్తే, టీడీపీ-జనసేన నేతల మధ్య మనస్పర్థలను సర్దుబాటు చేసుకోవచ్చని అంటున్నారు.
మరోవైపు వైసీపీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అభ్యర్థులు వ్యక్తిగతంగా ముఖ్య నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కానీ టికెట్ ఎవరికో తేలకపోవడంతో టీడీపీ, జనసేన నాయకులు ప్రచారానికి వెళ్లడం లేదు. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, టికెట్‌పై నమ్మకం లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల నేతలు దూకుడు ప్రదర్శించ లేకపోతున్నారు.