విశాఖ జిల్లాలో హాట్ ఫేవరేట్ సీటు ఉంది. అదే భీమునిపట్నం. ఆ సీటు మీద జనసేన కర్చీఫ్ వేసి చాలా కాలం అయింది. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరు అయినా జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఆ పార్టీ ఇంచార్జి పంచకర్ల సందీప్ కి ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చారు అని ప్రచారంలో ఉంది.
భీమిలి నుంచే జనసేన జెండా ఎగరాలి, సందీప్ ని ఈసారి ఎమ్మెల్యేగా చూడాలని అప్పట్లో మంగళగిరిలో జరిగిన పార్టీ మీటింగులో పవన్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సీటు విషయంలో జనసేన పూర్తి నమ్మకంతో ఉంది. ఇపుడు ఆ నమ్మకం వమ్ము అయ్యేలా ఉంది అని అంటున్నారు.
భీమిలీ మీద ఫోకస్ పెట్టిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయంలో విజయం సాధించారు అని అంటున్నారు. ఆయనను చీపురుపల్లికి బదిలీ చేస్తారు అని వార్తలు వచ్చినా గంటా చంద్రబాబుతో భేటీ తరువాత ఉత్సాహంగా కనిపించారు ఆయన భీమిలీ నుంచే పోటీ చేస్తాను అని చంద్రబాబుకు చెప్పారని దానికి హై కమాండ్ కూడా ఓకే చెప్పింది అని అంటున్నారు.
భీమిలీని వదులుకోవడానికి టీడీపీ కూడా ఇష్టపడడంలేదని అంటున్నారు. భీమిలీ టీడీపీకి కంచుకోట. ఒకసారి చేజారితే తిరిగి పోందలేమన్న ఆందోళన ఉంది. దాంతో గంటా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తొందరలోనే దీని మీద అఫీషియల్ గా ప్రకటన రావచ్చు అని అంటున్నారు
అనకాపల్లి జనసేనకు ఇచ్చినందువల్ల భీమిలీని తాము తీసుకుంటామని జనసేనకు టీడీపీ చెప్పవచ్చు అని అంటున్నారు. అయితే దీని మీద జనసేన ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. అయితే పెందుర్తి గాజువాక తో పాటు మరో సీటుని జనసేనకు చూపిస్తారు అని అంటున్నారు. భీమిలీ సీటు విషయంలో మాత్రం జనసేన ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.