భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ.. సిద్ధాంతాలకు మాత్రమే విలువ ఇస్తూ, రాజకీయ నైతికతకు పెద్దపీట వేసే పార్టీ అని సాధారణంగా చెబుతూ ఉంటారు. కానీ.. ప్రస్తుత భాజపా అలాంటి నిర్వచనాలకు సరితూగేది కాదని ఆ పార్టీ నాయకులే అంటూ ఉంటారు.
రాజకీయాల్లో ఉండే అన్నిరకాల అపభ్రంశపు వ్యవహారాలూ భాజాపాలో కూడా చాలా కామన్ అయ్యాయి. సిద్ధాంతాలు కాదు కదా.. వ్యక్తి పూజ అనేది ఆ పార్టీలో కూడా పరాకాష్టకు చేరుకున్న సంగతి స్పష్టంగా కనిపిస్తుంటుంది.
ప్రధాని నరేంద్రమోడీని సాక్షాత్తూ దేవుడి అవతారంగా అభివర్ణించి.. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నాయకుల తీరు కూడా ప్రజలు గమనించారు. అచ్చంగా బిజెపి, కాంగ్రెసు పార్టీకి నకలులాగా తయారైందనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ నిజమే అన్నట్టుగా తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి కూడా గళం విప్పడం గమనార్హం.
రాబోయే ఎన్నికల్లో కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుంది గానీ.. అందులో మోడీ మేజిక్ అంటూ ఏమీ ఉండబోదని సుబ్రమణ్యస్వామి తేల్చి చెబుతున్నారు. ఆరెస్సెస్ లో వ్వవస్థకు, సిద్ధాంతాలకే తప్ప వ్యక్తులకు ప్రాధాన్యం ఉండదని ఆయన అంటున్నారు. దేశ ప్రజల్లో హిందూత్వ భావం, గౌరవం పెరిగిందని, దాని వల్ల పార్టీ బలం పెరుగుతోందని అంటున్న స్వామి.. అందుకు తామే కారణం అని కొందరు నాయకులు అనుకోవచ్చు గానీ.. అది నిజం కాదు. అలా అనుకోవడం కాంగ్రెస్ సంస్కృతి అంటూ.. పరోక్షంగా మోడీ తీరును, ఆయన భజన పరుల తీరును ఎత్తిపొడుస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో కూడా పార్టీ గెలుస్తుందని అంటూనే.. అందుకు ఆయన చెబుతన్న కారణాలు వేరే ఉన్నాయి. నెహ్రూ కాలంలో దేశంలోని హిందువుల మీద ఉన్న ఆత్మన్యూనత ఒత్తిడి ఇప్పుడు లేదట. అందువల్ల హిందువులంతా భాజపావైపు చూస్తున్నారట.
తమ పార్టీ గెలుస్తుందని స్వామి చెప్పడం వింత కాదు. కానీ.. మోడీ ప్రభావాన్ని ఉంటుందనే వారి మాటలకు చెంపపెట్టులాగా ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ అంటేనే మోడీ.. మోడీ అంటేనే బిజెపి అన్నట్టుగా.. పార్టీలోని నవతరం భజన పరులు పార్టీని కొత్తదారిలో నడిపిస్తున్న తీరు అందరూ గమనిస్తున్నదే. మోడీ భజనలో పార్టీ నాయకులు పలువురు మరీ అతిచేస్తుండడం కూడా జరుగుతుంటుంది.
ఇవన్నీ కాంగ్రెసు పార్టీలో సోనియా కుటుంబ భజనలో పార్టీ నాయకులందరూ తరిస్తూ గడిపే తీరును గుర్తుకు తెస్తుంటుంది. అందుకే అలాంటి భజన పరులకు షాక్ లాగా.. సుబ్రమణ్య స్వామి.. మోడీ ఫ్యాక్టర్ కు మించి.. పార్టీ బలమైనదని అనడం చర్చనీయాంశం అవుతోంది.