వైసీపీలో గాజువాక పితలాటకం!

విశాఖ జిల్లాలో ఉన్న గాజువాక వైసీపీకి రాజకీయంగా ఎపుడూ హడావుడి పెడుతూనే ఉంటుంది. పారిశ్రామిక వాడగా ఉన్న ఈ ప్రాంతంలో సామాజిక రాజకీయ చైతన్యం ఎక్కువ. అభ్యర్ధుల సమర్ధత తో పాటు ఈ అంశాలు…

విశాఖ జిల్లాలో ఉన్న గాజువాక వైసీపీకి రాజకీయంగా ఎపుడూ హడావుడి పెడుతూనే ఉంటుంది. పారిశ్రామిక వాడగా ఉన్న ఈ ప్రాంతంలో సామాజిక రాజకీయ చైతన్యం ఎక్కువ. అభ్యర్ధుల సమర్ధత తో పాటు ఈ అంశాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు.

ఈ సీటులో 2019లో వైసీపీ మొదటిసారి గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జనసేన అధినేత పవన్ ని ఓడించారు. అలా గాజువాక పేరు మారుమోగింది. జెయింట్ కిల్లర్ గా నిలిచిన తిప్పల మంత్రి అవుతారు అనుకున్నారు కానీ ఆయన సీటుకే ఇపుడు ఎసరు వచ్చింది. స్ట్రాంగ్ గా ఉన్న తిప్పలను కాదని ఒక సాధారణ కార్పోరేటర్ రామచంద్రరావుకు ఇక్కడ పార్టీ టికెట్ ఇచ్చింది.

ఆయన యాదవ సామాజికవర్గం అని సతీమణి కాపు అని అలా రెండు సామాజిక వర్గాలు కలసి వస్తాయని లెక్క వేసింది. కానీ గాజువాకలో జనసేన టీడీపీ కలిస్తే బలంగా ఉన్నాయి. దాంతో ఇక్కడ ఇంచార్జిని మార్చాల్సిందే అని వైసీపీ నేతల నుంచి వత్తిడి వస్తోంది. విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్న బొత్స ఝాన్సీలక్ష్మి గెలవాలంటే గాజువాకలో ఇంచార్జిని మార్చాలని బొత్స సత్యనారాయణ పట్టుబడుతున్నారు అని అంటున్నారు.

గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పలకే టికెట్ ఇస్తే బాగుంటుందని ఆయన సూచించారు అని ప్రచారం సాగుతోంది.అలా కాదు సామాజిక సమీకరణలు అని భావిస్తే విశాఖ మేయర్ హరి వెంకట కుమారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని కూడా చెప్పారని తెలుస్తోంది. మేయర్ గా మంచి పేరు ఉన్న ఆమెను అభ్యర్ధిగా చేస్తే ఫలితం అనుకూలంగా వస్తుందని అంటున్నారు.

విశాఖ ఎంపీ సీటులో చూస్తే ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎస్ కోట, భీమిలీ ఉత్తరం లో వైసీపీకి కొంత అనుకూలత ఉంది, మిగిలిన నాలుగు సీట్లలో కూడా మెజారిటీలు సాధిస్తేనే ఎంపీ సీటు కైవశం అవుతుందన్న లెక్కలతోనే బొత్స పార్టీ పెద్దలకు గాజువాక సీటు విషయంలో మార్పులు సూచించారు అని అంటున్నారు.

గాజువాక ఇపుడు వైసీపీకి పితలాటకంగా మారింది అని అంటున్నారు. ఇక్కడ మార్పు అంటూ జరిగితే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. వారు కూడా ఆశపడతారు. వైసీపీ హై కమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.