విశాఖ రాజధాని అని ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన పరిస్థితి లేదు. అది లాంచనం. ఎందుకంటే ఏపీకి ఉన్న ఏకైక అతి పెద్ద సిటీ విశాఖ మాత్రమే. ఎవరు కాదన్నా ఇది సత్యం. విశాఖ గ్రేట్ సిటీ అని అందరికీ తెలుసు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై ముంబైలతో ఫ్యూచర్ లో పోటీ పడే సత్తా కలిగిన సిటీ.
ఏపీకి గ్రోత్ ఇంజన్ లాంటి సిటీ. దానిని రాజధాని చేసుకుంటే ఏపీకే లాభం. అయితే గత టీడీపీ ప్రభుత్వ పెద్దలకు ఈ సంగతులు తెలియనివి కావు. కానీ తామే ఒక అద్భుత రాజధానిని నిర్మించామని చరిత్రలో నిలిచేందుకు కొండంత భారం అయిన అమరావతిని ఎత్తుకున్నారు.
అది కష్టసాధ్యమని తెలిసినా దాని చుట్టే అన్నీ అల్లుకుంటూ పోయారు. అలా అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు పన్నెండు ఎకరాల స్థలం కూడా చూపించారు. ఇంతలో ప్రభుత్వం మారింది. విశాఖకు కొత్త ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తూ వస్తోంది.
విశాఖ ఫ్యూచర్ సిటీ అన్నది ఎవరూ చెప్పకపోయినా అర్ధమయ్యే విషయం. అందుకే అమరావతిలో పన్నెండు ఎకరాల స్థలం ప్రతిపాదన ఉన్నా విశాఖకు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం తరలి వస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ ప్రతిపాదనలు పంపించింది.
విశాఖలోనే తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరం అయిన భూమి లేదా భవనం చూపించాలని ఆర్బీఐ కోరడం విశేషం. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో సువిశాలమైన 30 నుంచి 35 వేల చదరపు అడుగుల భవనాలను గుర్తించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తొందరలోనే భవనం కేటాయిస్తే అంతే త్వరగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం విశాఖకు తరలిరానుంది.
దేశంలో అన్ని రాజధాని నగరాలలోనే ఆర్బీఐ ప్రాంతీయ ఆఫీసులు ఉండడం విశేషం. ఏపీలో విశాఖలో ఆర్బీఐ ఆఫీసు ఉంది అంటే అది ఇండైరెక్ట్ గా క్యాపిటల్ సిటీ కిందనే లెక్క అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వస్తే ఆరు నూరు అయినా విశాఖ క్యాపిటల్ సిటీ అవుతుంది అన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యం నుంచి చూస్తే ప్రఖ్యాత సంస్థలు మేధావులు ఎవరైనా విశాఖ వైపే చూస్తారు అనడంలో సందేహం. లేదు.