తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతిన్న బీఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల రూపంలో విషమ పరీక్ష ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్ పెరిగింది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపించడం కాంగ్రెస్ నేతలకు ప్రతిష్టగా మారింది. ఇక ఎలాగూ బీజేపీ తన ప్రయత్నాలు తను చేసే అవకాశం ఉంది.
రెండు జాతీయ పార్టీలు తలపడే అవకాశం ఉన్న చోట ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కు ప్రాధాన్యత తగ్గుతుందనడంలో ఆశ్చర్యం లేదు. తమది జాతీయ పార్టీ అని బీఆర్ఎస్ వాళ్లు ఏనాడో ప్రకటించారు. అయితే అది ప్రకటన వరకే, పేరు మార్పు వరకే అని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ అనే పరిస్థితి ఉంటుంది లోక్ సభ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజానీకానికి కూడా! ఒకవేళ బీఆర్ఎస్ వరసగా మూడో సారి అధికారాన్ని చేపట్టి ఉంటే.. అది లోక్ సభ ఎన్నికల్లో పోరడటానికి వీలుండేది. రెండోసారి అధికారాన్ని చేపట్టినప్పుడు కూడా లోక్ సభ ఎన్నికల వరకూ వచ్చే సరికి కాంగ్రెస్ , బీజేపీలు గట్టిగా తమ సత్తా చూపాయనేది కూడా వేరే చెప్పనక్కర్లేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం కూడా తెలంగాణలో టీఆర్ఎస్ కు దక్కిన ఎంపీ సీట్లు తక్కువే! ఈ లెక్కన చూస్తే.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రాధాన్యత తగ్గిపోతుంది!
మరి ఇప్పుడు బీఆర్ఎస్ కు ముందున్న మార్గాల్లో ఒకటి బీజేపీతో పొత్తు. కమలం పార్టీతో పొత్తు కుదుర్చుకుంటేనే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా పోరులో ఉన్నట్టవుతుంది. ఇక బీజేపీ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు కాబట్టి.. కలిసొచ్చినన్ని సీట్లు కలిసిరాని అన్నట్టుగా పొత్తుకు రెడీ కావడంలో పెద్ద విచిత్రం లేదు!
మరి మొన్నటి వరకూ బీఆర్ఎస్ ను ఎంఐఎం బీ టీమ్ అంటూ బీజేపీ విమర్శించింది. మరిప్పుడు అర్జెంటుగా పొత్తెట్టుకుంటుందా.. అంటే, కమలం పార్టీకి కూడా అలాంటి నైతికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు. అవినీతి పరులని విమర్శించిన కాంగ్రెస్ నేతలనే పిలిచి కండువాలు వేస్తోంది కమలం పార్టీ. కాబట్టి.. నాలుగు సీట్లు కలిసొస్తాయంటే బీఆర్ఎస్ తో పొత్తుకు ఆ పార్టీకి కూడా పెద్ద మొహమాటాలు ఏమీ ఉండకపోవచ్చును!