చిత్రం: బేబి
రేటింగ్: 2.25/5
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు..
నిర్మాత: ఎస్కేఎన్
ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: విప్లవ్
విడుదల తేదీ: జులై 14, 2023
కల్ట్ సినిమా తీయాలంటే బూతులు పెట్టాల్సిందేనా? 2-3 శృంగార సన్నివేశాలు జోడించాల్సిందేనా? అలా తీస్తే అది కల్ట్ సినిమా అయిపోద్దా? ఇప్పటితరానికి నచ్చుతుందని అదే పనిగా బూతులు, అడల్ట్ సీన్స్ పెడితే సినిమాకు కల్ట్ స్టేటస్ వచ్చేస్తుందా? ఇన్నిసార్లు కల్ట్ అనే పదాన్ని ఎందుకు వాడామంటే, ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ అంతకంటే ఎక్కువసార్లు ఈ పదాన్ని ఉపయోగించారు కాబట్టి. పైగా నిర్మాత ఎస్కేఎన్ తొడకొట్టి మరీ కల్ట్ బొమ్మ అని చెప్పుకున్నాడు కాబట్టి. అయితే వాళ్లంతా చెప్పినట్టు ఇది కల్ట్ సినిమా కాదు. నిజంగానే కల్ట్ సినిమాలుగా నిలిచిన కొన్ని పాత తమిళ-తెలుగు సినిమాలకు, హైటెక్ హంగులు జోడించి తీసిన సినిమా ఇది.
వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైస్కూల్ నుంచి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ని ప్రేమిస్తుంది. వైష్ణవి ఇంజినీరింగ్ కాలేజీలో చేరగా, టెన్త్ ఫెయిలైన ఆనంద్ కాలక్రమేణా ఆటో డ్రైవర్గా మారుతాడు. కాలేజీలో రిచ్ కిడ్ విరాజ్ (విరాజ్ అశ్విన్), వైష్ణవిని ప్రేమించి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవి, విరాజ్ కు ఎట్రాక్ట్ అవుతుంది, అదే టైమ్ లో ఆనంద్ పట్ల ప్రేమగా కూడా ఉంటుంది. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల విరాజ్ ముద్దు ప్రతిపాదనను వైష్ణవి అంగీకరిస్తుంది. అది ఆమెను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది. వైష్ణవి జీవితం ఎలా మారిపోయింది? విరాజ్ ఏమయ్యాడు? చివరికి ఆనంద్ ప్రేమలో గెలిచాడా లేదా అనేది ఈ బేబి కథ.
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ స్పూఫ్ లు తీసిన సాయిరాజేష్, ఈసారి ఎలాగైనా ఓ కల్ట్ ప్రేమకథ తీయాలని కంకణం కట్టుకొని ఈ సినిమా కథ-స్క్రీన్ ప్లే రాసుకున్నట్టున్నాడు. అయితే అతడి ఆలోచన విధానం సరిగ్గా లేదు. పబ్ కల్చర్, సిగరెట్లు, మద్యం లాంటి పోకడల్లో చిక్కుకొని, యువత తమ జీవితాల్ని నాశనం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సినిమాలో ఇచ్చాడు. అయితే అలా సందేశం ఇవ్వడం కోసం సాయిరాజేశ్, చాలా అసభ్యకరమైన దారిని ఎంచుకున్నాడు. సందేశం మాట అటుంచి, ఆ అసభ్యతకు యువత మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది ఈ బేబి.
నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను తీసుకొని, వాటితో భావోద్వేగాల్ని పండించాలనుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో అతడు కొన్ని సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు కానీ, పాత్రల చిత్రణ, వాటి ప్రవర్తనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. దీంతో తెరపై కొన్ని సందర్భాల్లో ఓ రకమైన గందరగోళం, అనిశ్చితి కనిపించింది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కీలకమైన హీరోయిన్ పాత్ర. ప్రారంభంలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన ఈ పాత్ర, క్రమంగా అర్బన్ అమ్మాయిగా మారిపోతుంది. మొదట చూసిన పాత్ర స్వభావానికి పూర్తి విరుద్ధంగా మారిపోతుంది. నిజజీవితంలో అమ్మాయిలు ఇంతలా మారిపోతారా అనే ఆశ్చర్యాన్ని పక్కనపెడితే.. ఆమెపై ప్రేక్షకుల్లో సానుభూతి కలగాలనేది దర్శకుడి ఆలోచన. 'అయ్యో… ఎలాంటి అమ్మాయి ఇలా అయిపోయిందేంటి' అనే ఫీలింగ్ కలిగించాలని అనుకున్నాడు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆ పాత్రపై ప్రేక్షకుల్లో సానుభూతి బదులు వ్యతిరేకత ఏర్పడుతుంది. తన కొత్త స్నేహితులతో హీరోయిన్ ఎన్నో పనులు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతుంది. ఇంత చేసిన అమ్మాయికి డేటింగ్ అంటే ఏంటో తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది, క్యారెక్టర్ లో కన్ఫ్యూజన్ కు దారితీస్తుంది.
కేవలం హీరోయిన్ పాత్రలోనే కాదు, మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ లో కూడా ఇదే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు దర్శకుడు. కొన్నిసార్లు ఆదర్శవంతగా, మరికొన్ని సందర్భాల్లో స్లమ్ డాగ్ గా చూపించి సింపతీ క్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ కు, దర్శకుడి ఊహకు సింక్ కుదరలేదు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో సింపతీ సంగతి దేవుడెరుగు, ప్రేక్షకులు గట్టిగా నవ్వి, సదరు పాత్రను ట్రోల్ చేశారు.
అక్కడక్కడ క్యారెక్టరైజేషన్ లో లోపాలున్నప్పటికీ ఆనంద్ దేవరకొండ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో మెప్పించాడు. భగ్నప్రేమికుడిగా అతడి యాక్టింగ్ బాగుంది. ఇక ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య చాలా బాగా చేసింది. ఆమె కళ్లతో భావాలు పలికించిన తీరు బాగుంది. పక్కింటి అమ్మాయి లుక్స్ నుంచి మోడ్రన్ లుక్ లోకి మారిన విధానం కూడా మెప్పిస్తుంది. మరో కీలక పాత్రధారి విరాజ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించాడు. నాగబాబు, వైవా హర్ష తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు దర్శకుడు కల్ట్ లవ్ స్టోరీ తీయాలనే కసితో విశ్వప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల వసంత కోకిల ఛాయలు చూపించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ, పాత్రల పరిచయం, హీరోయిన్ పాత్ర రూపాంతరం చెందడం, సూపర్ హిట్ సాంగ్ వల్ల ఓకే అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండాఫ్ లో మాత్రం చాలా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి, పైగా మనం ఊహించుకునేలా ఉంటాయి. ఇక క్లయిమాక్స్ అయితే ఎప్పటికీ ముగిసిపోదు. కథనాన్ని మరీ ఎక్కువగా సాగతీశాడు దర్శకుడు. అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం వల్ల ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయ్యాడు.
దీనికితోడు సినిమాలో పెట్టిన బూతు డైలాగులు మరో ప్రహసనం. సెన్సార్ లో మ్యూట్ అవుతాయని తెలిసి కూడా, కొన్ని పదాల్ని అదే పనిగా వాడారు. దాదాపు తెలుగులో మాట్లాడుకునే బూతులన్నీ బేబిలో వినిపిస్తాయి. మ్యూట్ అయినా మనకు అర్థమైపోతాయి. ఇక మరికొన్ని డైలాగ్స్ విషయానికొస్తే.. 'నువ్వు తెరవాల్సింది కళ్లు కాదు, కాళ్లు' అనే డైలాగ్ తో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతడికే తెలియాలి. ప్రాస బాగుందని, ఇలా బూతును విచ్చలవిడిగా వాడేసినట్టు అనిపించింది. లవ్ ఫెయిలైతే ఏ మగాడైనా ఓ మూల కూర్చొని మందు కొట్టాల్సిందే అనే అర్థం వచ్చేలా పెట్టిన డైలాగు దర్శకుడి ఓల్డ్ స్కూల్ ఆలోచనను ప్రతిబింబిస్తుంది.
దర్శకుడి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ వాటికి మంచి ఫ్రేమ్స్ దక్కాయి. అందమైన సినిమాటోగ్రఫీకి, అంతే అందమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దొరికింది. సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి. 'ఓ రెండు మేఘాలిలా' సాంగ్ అయితే టోటల్ సినిమాకే హైలెట్. దాని కొనసాగింపుగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మనసుకు హత్తుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, ఎడిటింగ్ లో కంప్లయింట్స్ ఉన్నాయి. సినిమాను అంత లెంగ్త్ లో ఎందుకు వదిలేశారో అర్థంకాదు. బహుశా.. 'కల్ట్ సినిమా' తీస్తున్నప్పుడు లెంగ్త్ కూడా ఎక్కువ ఉండాలని ఫీల్ అయ్యారేమో.
చాలా చోట్ల ఆర్ఎక్స్ 100 ఛాయలు కనిపించిన ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ను కాకుండా, చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెను ఎలా మార్చాయనే కోణంలో దర్శకుడు కథను 'సవివరంగా' చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో లవ్ కంటే లస్ట్ ఎక్కువగా చూపించాడు. బూతులు, భారీ రన్ టైమ్ అదనం. కథ ప్రకారం సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ చివరికొచ్చేసరికి బాధితులుగా మారతాయి. సుదీర్ఘంగా 3 గంటల పాటు కూర్చొని ఈ సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే.
బాటమ్ లైన్ – ఇక చాలు ఆపు బేబి