చిరంజీవి వరుస సినిమాలతో బిజీ. రామ్ చరణ్ సినిమాలతో పాటు బిజినెస్ తో బిజీ. ఉపాసన సంగతి సరేసరి. ఇప్పుడు చిరంజీవి భార్య సురేఖ కూడా బిజీ కాబోతున్నారు. అత్త సురేఖతో 'అత్తమ్మాస్ కిచెన్' అనే కొత్త వ్యాపారం మొదలుపెట్టించింది ఉపాసన.
ఉపాసన నేతృత్వంలో సురేఖ స్థాపించిన ఈ కొత్త వెంచర్, భోజనప్రియులకు ట్రెడిషనల్ రుచుల్ని అందిస్తుంది. ప్రారంభంలో ఉప్మా, పొంగల్, పులిహోర, రసం ఇనిస్టెంట్ మిక్స్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
సురేఖ చేసే రసం అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి గతంలో పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెసిపీ అందరికీ అందుబాటులోకి వచ్చినట్టయింది. పైగా అత్త సురేఖతో ఉపాసనకు ఉన్న బంధాన్ని ఈ వెంచర్ ఆవిష్కరిస్తుందని చెబుతున్నారు.
ఈ వెంచర్ కోసం ఉపాసన తన బిజినెస్ స్కిల్స్ అన్నింటినీ వాడినట్టు తెలుస్తోంది. వెబ్ సైట్ డిజైన్ నుంచి ప్రతి విషయాన్ని దగ్గరుండి తన టీమ్ తో చేయించుకున్నారు ఉపాసన. తెలుగు సంప్రదాయాల్లో భాగంగా ఉన్న అన్ని వంటకాల రెసిపీల్ని ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలనేది లక్ష్యం.
రెడీ మిక్స్ వ్యాపారాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న ట్రెడిషనల్ రుచులు కూడా రెడీ మిక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటి మధ్య సురేఖ వ్యాపారం ఎలాంటి కొత్తదనాన్ని చూపిస్తుందో చూడాలి.