తాను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం అనే నీతిని పచ్చమీడియా ఇంకాస్త నీచంగా పాటిస్తూ ఉంటున్నది. తమకు ఇష్టులైన నాయకుడు మాట్లాడితే ఒక రకంగా, తమకు కొరుకుడుపడని నాయకుడు మాట్లాడితే మరో రకంగా భాష్యాలు చెప్పడం అనేది పచ్చమీడియాకు మాత్రమే చెల్లిన విద్య.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి మన విద్యారంగంలో ఉండాలనే అభిలాషం.. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల విధానాలను మన విశ్వవిద్యాలయాల్లో తీసుకురావాలనే ఆశ..!
వీటిని వ్యక్తం చేసినది ఏ చంద్రబాబునాయుడో అయి ఉంటే.. పచ్చ మీడియా హడావుడి మొత్తం ఇంకో లెవెల్లో ఉండేది. ఆయన దార్శనికుడు అని, తను ఉన్న కాలం కంటె వెయ్యేళ్ల ముందుగా ఆలోచిస్తాడని, అందుకే వెయ్యేళ్లకు రూపుదిద్దుకోగల అమరావతి నగరానికి ఇప్పుడు స్కెచ్ లు రూపొందించాడని, యూనివర్సిటీల్లో కూడా వెయ్యేళ్ల ముందరి స్థాయికి తగ్గట్టుగా ఇప్పుడే దిశానిర్దేశం చేస్తున్నాడని పుచ్చిపోయిన పొగడ్తలతో ఆయన స్తోత్రపాఠాలను పఠిస్తూ.. ఈ పచ్చమీడియా తరించిపోయి ఉండేది.
కానీ.. ఇవే పదాలను జగన్మోహన్ రెడ్డి పలికే సరికి.. ఆ భావాలను, దృక్పథాన్ని దార్శనికతగా ఒప్పుకోవాలంటే వారికి మనసు రావడం లేదు. జగన్ వైఖరి మీద బురద చల్లాలని చూస్తున్నారు. హేయమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఉన్నత విద్యకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేసి, పాఠశాల స్థాయిలోనూ మరో బోర్డు ఏర్పాటుచేసి రెండింటినీ అనుసంధానం చేయడం ద్వారా.. విద్యారంగంలో అద్భుతాలు సృష్టించగల అవకాశాలను గురించి ఆయన వారితో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పూర్తిగా వినియోగించుకోవాలని, ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు రాయించే తీరు రావాలని జగన్ దిశానిర్దేశం చేశారు.
నిజానికి ఇదంతా అభినందించి తీరాల్సిన సంగతి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లిషు మీడియంను అందుబాటులో ఉంచుతూ, సీబీఎస్ఈ విధానం తీసుకువస్తూ ప్రపంచస్థాయి విద్యను అందుబాటులో ఉంచుతున్నారు.
మన విద్యార్థులను విదేశీ చదువులకు అనువైన విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల స్థాయిలోనే జీఆర్ఇ, టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధులను చేసే ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ఇవేవీ కూడా.. విద్యారంగంలో ఇప్పటిదాకా ఎవరూ ఊహించని మార్పులు. పాఠశాల స్థాయిలో తీసుకువస్తున్న అత్యంత ఆధునిక విద్యావిధానాలకు కొనసాగింపుగా.. విశ్వవిద్యాలయాలను కూడా అందుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు జగన్ వీసీల సమావేశం నిర్వహించారు.
అంతర్జాతీయ స్థాయి వర్సిటీల స్థాయిలో తీర్చిదిద్దాలనే తన కలలను వివరించారు. వాటిని చేరుకోవడానికి కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది, కొంతదూరం ప్రయాణం అవసరం.. కొంతకాలం పడుతుంది! అయితే పచ్చమీడియా మాత్రం.. దీనిపై విమర్శలు ప్రారంభించింది.
ఇప్పుడు వర్సిటీల్లో అధ్యాపకుల కొరత ఉన్నదని, నిధులు విడుదల చేయడం లేదని.. అయిన వారినే వీసీలుగా నియమిస్తున్నారని రకరకాల వక్రభాష్యాలతో జగన్ అసలు లక్ష్యం ఏమిటో ప్రజలకు అర్థం కాకుండా విషప్రచారం చేస్తోంది. వర్సిటీల్లో సమస్యలను తెలియజెప్పడం మంచిదే.. కానీ.. జగన్ కలల విషయంలో అపశకునాలు పలుకుతోంది.
తెలుగు సమాజానికి ద్రోహం చేసే ఇలాంటి పోకడలను మీడియా విడిచిపెట్టకుంటే ప్రజలే వారిని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది.