ఎమ్మెల్యే అంటే లోకల్ జనాలకు ఎంత దగ్గర వుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే పక్కింటితో సరిహద్దు గొడవల దగ్గర నుంచి, మొగుడు పెళ్లాల పేచీల వరకు అన్నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గరకే వస్తాయి.
తమ మాట విని, ఓ మాట ఓదార్పుగా చెప్పడమో, సంబంధిత ఆఫీసు వాళ్లకి ఫోన్ చేసే వరకు జనం వదలరు. ఎమ్మెల్యేలకు ఇది తప్పదు. చంద్రబాబు, జగన్, ఇలాంటి వాళ్లకు ఈ సమస్య వుండదు. దగ్గర బంధువులనో, పిఎ నో తమ నియోజకవర్గంలో వుంచి, జనాలకు కాంట్రాక్ట్ లో వుండేలా చూస్తారు. బాలకృష్ణ కూడా తన నియోజకవర్గంలో కూడా ఓ పిఎ ను వుంచారు. దానికి దరిమిలా అనేక విమర్శలు, గొడవలు కూడా జరిగాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. గెలిచానా, ఓడినా నియోజక వర్గాన్ని అంటి పెట్టుకుని, నమ్ముకుని వుండడం, ప్రజలకు అందుబాటులో వుండడం అన్నది రాజకీయ నాయకులకు అత్యంత అవసరం. కానీ పవన్ కళ్యాణ్ తీరు వేరు.
గాజువాక లో ఓడిపోగానే అక్కడ పార్టీ ఆఫీసు ఖాళీ చేసారు. మళ్లీ అటు చూడలేదు. భీమవరం సంగతి కూడా డిటో.. డిటో. ఇప్పుడు పిఠాపురం వంతు వచ్చింది. కాపుల ఓట్ల అండతో గెలుస్తామని నమ్మకంగా వున్నారు పవన్. మరి గెలిచిన తరువాత పవన్ సామాన్య జనానికి అందుబాటులో వుంటారా? లేక జగన్, బాబు, బాలకృష్ణ మాదిరిగానే ఓ పిఎ ను అక్కడ పెడతారా?
నిజానికి పవన్ అంత సులువుగా ఎవరినీ కలవరు. ఆ మధ్య పవన్ నే ఓ మాట అన్నారు. తాను షూటింగ్ ల్లో వుంటే వీళ్లందరినీ దూరంగా వుంచతాను. తనను కలవాలని కిందా మీదా అవుతుంటారు అని గొప్పగా చెప్పారు. జనసేనలో టికెట్ లు దొరకని వారు, జనసేన పోటీ చేయకుండా వదిలేసిన చోట్ల వున్న నాయకులు పవన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి దొరకక, పార్టీని వదిలేసిన వ్యవహారాలు వున్నాయి.
మరి ఇప్పుడు పవన్ గెలిస్తే పరిస్థితి ఏమిటి? ఓడితే పరిస్థితి ఏమిటి? జనాల బాధలు, సమస్యలు వినేంత ఓపిక పవన్ కు వుందా? లేదా పవన్ పెట్టిన పిఎ లేదా మరో సన్నిహితుడు ఎవరైనా జనాలను పట్టించుకుంటారా? లోకల్ గా వుండే వంగా గీత తో ఎలా వుంటుంది. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చునే పవన్ తో ఎలా వుంటుంది. ఈ కోణంలో పిఠాపురం ప్రజలు ఆలోచించడం మొదలుపెడితే వంగీ గీతకు పవన్ కు తేడా విషయంలో క్లారిటీ వస్తుందేమో?