తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డికి కమ్మ నాయకుడు డాక్టర్ పోతుగుంట రాజేష్‌నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేతుల మీదుగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, శ్రీకాళహస్తి బోర్డు మాజీ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడి తనయుడే రాజేష్‌నాయుడు. దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గురవయ్యనాయుడు గుర్తింపు పొందారు.
గురవయ్యనాయుడు కుమారుడు డాక్టర్ రాజేష్‌నాయుడు వైద్యుడిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీ టికెట్ ఆశించారు. బొజ్జల సుధీర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడి నుంచి రాజేష్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు.
అయితే టికెట్ రేస్‌లో రాజేష్‌నాయుడు నిలవలేకపోయారు. బొజ్జల సుధీర్‌కు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
రాజేష్నాయుడికి శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో కమ్మ సామాజిక వర్గంలో బలం వుంది. ఇప్పుడాయన కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బే. కాంగ్రెస్‌కు రాజేష్ రూపంలో మంచి నాయకుడు దొరికినట్టైంది.