రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అధికారం ఎవరిదనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నా ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి ఎవరనే ఆరా తప్పని సరైంది. ఎన్నికలకు ఇక 50 రోజులు మాత్రమే గడువు వుంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సామాన్యులు మొదలుకుని మేధావుల వరకూ తమకు తెలిసిన రీతిలో ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా ఏపీలో సర్వత్రా వినిపించే మాట...”రెండు నెలల క్రితం వరకూ చంద్రబాబే సీఎం అవుతారని అనుకున్నాం. కానీ పొత్తులే ఆయన్ను ముంచేలా ఉన్నాయి. జనసేనతో పొత్తు కుదుర్చుకుని, సీట్లు సర్దుబాటు చేయలేకపోతున్నారు. టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య పరస్పరం శత్రుభావన ఏర్పడింది. ఇది చాలదన్నట్టు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘోరమైన తప్పు చేశారు. ముస్లిం, క్రిస్టియన్, దళిత, గిరిజనుల్లో ఉన్న అంతోఇంతో సానుభూతిని కూడా చంద్రబాబు కోల్పోయారు. రెండు నెలల్లో వైఎస్ జగన్ నెగెటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చారు. కళ్ల ముందే ఎంత మార్పు. బాబు మాత్రం ఇక ఎప్పటికీ సీఎం కాలేరు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది” అనే చర్చ ఎక్కడ చూసినా నడుస్తోంది.
జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా.. వైసీపీ ఖాతాలో ఓ 25 అసెంబ్లీ, ఆరేడు లోక్‌సభ సీట్లు అప్పనంగా వచ్చి పడ్డాయని చంద్రబాబు అభిమానులు సైతం అంటున్న మాట. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకే బలమైన నేతలు లేకపోవడంతో వైసీపీ నుంచి వెళ్లిన వారికి ఇచ్చిన, ఇస్తున్న పరిస్థితి. ఇక జనసేన, బీజేపీ అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేదేమీ లేదు.
ఏపీలో పొత్తు పరిణామాలు రాజకీయంగా వైసీపీకి కలిసొచ్చాయి. మరీ ముఖ్యంగా పవన్‌కల్యాణ్ వైఖరితో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి చాలా వరకు దూరమయ్యారు. పవన్‌కు మంచీచెడుల గురించి చెప్పేవాళ్లంతా వైఎస్ జగన్ కోవర్టులుగా కనిపిస్తున్నారు. తనకు సలహాలు ఇవ్వొద్దని, అలాంటి వాళ్లు తనకు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటించి, తన గొయ్యి తానే తవ్వుకున్నారు. అలాగే 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు తీసుకోవడం చాలా తక్కువని జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉండగా, బీజేపీతో పొత్తు వల్ల మరో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని కోల్పోవాల్సి రావడం, సొంత పార్టీ శ్రేణుల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది.
దీంతో జనసేన అంటే టీడీపీ, బీజేపీ పల్లకీలు మోసే సేన మాత్రమే అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థమైంది. ఇక పవన్‌కల్యాణ్‌తో నడవడం వృథా అనే అభిప్రాయానికి వచ్చి, ఇంత కాలం ఆయన్ను అభిమానించే వాళ్లంతా దూరమయ్యారు. పొత్తుతో కోరుకున్న సీట్లు దక్కకపోవడంతో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి ఓట్లు పరస్పరం బదిలీ అయ్యే అవకాశం లేదు. అంతిమంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది టీడీపీనే.
పవన్‌కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నదే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్ల కోసమని అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.
రాజమండ్రి రూరల్ నుంచి జనసేన ఇన్‌చార్జ్ కందుల దుర్గేష్ పోటీ చేయాలని అనుకున్నారు. ఈ మేరకు రాజమండ్రి రూరల్‌లో ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి గడపా తిరిగారు. పవన్‌కల్యాణ్ కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కందుల అనుచరులు సంబరాలు చేసుకున్నారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెరపైకి వచ్చారు. సిటింగ్ ఎమ్మెల్యే అయిన తనకు కాకుండా, కందుల దుర్గేష్‌కు హామీ ఇవ్వడానికి పవన్‌కల్యాణ్ ఎవరని ప్రశ్నించారు. తనకు రాజమండ్రి రూరల్ సీటు రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు.
చివరికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటే నెగ్గింది. దీంతో కందుల దుర్గేష్ సామాజిక వర్గం మనసులు గాయపడ్డాయి. తమ ఆత్మాభిమానాన్ని బుచ్చయ్య సామాజిక వర్గం దెబ్బతీసిందనే ఆవేదనతో ఉన్నారు. రాజమండ్రి రూరల్‌తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటు వేసే ప్రశ్నే లేదని కాపులు బహిరంగంగానే హెచ్చరించారు. ఇదిలా వుండగా నిడదవోలుకు వెళ్లిన కందుల దుర్గేష్‌కు అక్కడి టీడీపీ నేతల నుంచి నిరాదరణ ఎదురైంది.
నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా కందుల దుర్గేష్‌కు టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. అసలు తన ఇంటి వద్దకు వచ్చిన దుర్గేష్‌ను కలవడానికి కూడా ఆయన ఇష్టపడలేదంటే… ఆ నియోజకవర్గంలో జనసేన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తే… పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేం.
ఇవి మచ్చుకు ఒకట్రెండు ఉదాహరణలు మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ నియోజకవర్గం తీసుకున్నా కూటమి పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. “మీ వల్ల మేము నష్టపోయాం” అనే భావన ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతల మధ్య బలంగా ఉంది. ఇలాంటి చిన్నచిన్న అసంతృప్తులే పెద్దవై… చివరికి బాగుందనుకున్న టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. “ప్చ్..లాభం లేదబ్బా, రెండు నెలల క్రితం వరకూ టీడీపీ ఓకే. ఇప్పుడేం చెబుతాం?” అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే నిట్టూర్చుకతున్నారు.
రెండు నెలల క్రితం ఉభయగోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి కనీసం 29 సీట్లు దక్కుతాయనే వాతావరణం కనిపించింది. ఇప్పుడు చూస్తే… వైసీపీ, కూటమికి చెరో సగం సీట్లు వస్తాయనే మాట వినిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో బాగా వస్తాయని అనుకున్న చోటే కూటమి భారీగా నష్టపోతోంది. అలాగే ఆ రెండు జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందని రెండు నెలల క్రితం ఆ పార్టీ నేతలు కూడా భయపడ్డారు. మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 15 సీట్లు వస్తే చాలు… అధికారానికి భయం లేదని ధీమాతో ఉన్నారు.
రాష్ట్రంలో అధికారాన్ని ఉభయ గోదావరి జిల్లాలు శాసిస్తుంటాయి. అలాంటి చోట ప్రస్తుత వాతావరణం ఇది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొత్తు టీడీపీని భారీగా దెబ్బ తీస్తోంది. బీజేపీ, జనసేన పోటీ చేస్తున్న చోట బలహీనమైన అభ్యర్థులు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల ఆ పార్టీల గుర్తులు వాటికి మైనస్ అవుతున్నాయి. మొత్తానికి పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడి చేజేతులా అధికారాన్ని పోగొట్టుకుంటున్నారనే వాతావరణాన్ని సృష్టించారని చెప్పక తప్పదు.